Ishan Kishan : నా నుంచి ఏం ఆశిస్తున్నారు? వేలం తరువాత జరిగిన సంగతి బయటపెట్టిన సెంచరీ హీరో ఇషాన్ కిషన్.. ఒకే మాట చెప్పారట..
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతకంతో చెలరేగాడు ఇషాన్ కిషన్.

pic credit @ani
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ శుభారంభం చేసింది. ఆదివారం ఉప్పల్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఇక ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డు కూడా సన్‌రైజర్స్ పేరిటే ఉండడం విశేషం. ఐపీఎల్ 2024 సీజన్‌లో 287/3 స్కోరును ఎస్ఆర్‌హెచ్ సాధించింది.
ఐపీఎల్ కెరీర్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ వచ్చాడు యువ ఆటగాడు ఇషాన్ కిషన్. ఈసారి అతడిని సన్‌రైజర్స్ రూ.11.25 కోట్ల మొత్తానికి మెగావేలంలో కొనుగోలు చేసింది. సహజంగా ఓపెనర్ అయిన ఇషాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున ఏ స్థానంలో ఆడతాడో, ఎలా రాణిస్తాడోనన్న సందేహం చాలా మందిలో ఉంది.
అయితే.. తొలి మ్యాచ్‌లోనే అనుమానులు అన్నింటిని ఇషాన్ కిషన్ పటాపంచలు చేశాడు. ఉప్పల్ వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 45 బంతుల్లో సెంచరీ బాదేశాడు. మొత్తంగా 47 బంతులను ఎదుర్కొన్న ఇషాన్ 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
కాగా.. సెంచరీ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడాడు. సీజన్ తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు. సన్‌రైజర్స్ జట్టు తనపై పూర్తి నమ్మకం ఉంచిందన్నాడు. స్వేచ్ఛగా ఆడమని మాత్రమే చెప్పారన్నాడు. సెంచరీ చేసినా, డకౌట్ అయినా ఫర్వాలేదని కమిన్స్ చెప్పాడని ఇది ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నాడు.
ఇక ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లు దూకుడైన ఆటతో మంచి ఫ్లాట్‌ఫామ్‌ను సెట్ చేశారన్నాడు. ‘నేను నా సహజమైన ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నం చేశాను. గత కొంతకాలంగా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అందుకు ప్రతి ఫలం ఇప్పుడు దక్కింది. మున్ముందు ఇదే ఆటతీరును కొనసాగిస్తా.’ అని ఇషాన్ కిషన్ చెప్పాడు.
అభిషేక్ శర్మకు కాల్ చేసి..
మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తనను తీసుకున్న వెంటనే ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు కాల్ చేసినట్లుగా ఇషాన్ చెప్పాడు. జట్టు తన నుంచి ఏం ఆశిస్తుంది? వచ్చిన ప్రతి బంతిని బౌండరీకి తరలించాలా ? అని అడిగాను. ఇందుకు అభిషేక్ మాట్లాడుతూ.. నిజం చెప్పావు.. అదే నీ పని అని చెప్పాడు అని ఇషాన్ నాటి సంగతులను వివరించాడు.
CSK vs MI : మ్యాచ్ ముగిశాక ముంబై ఆటగాడు దీపక్ చాహర్‌ను బ్యాట్‌తో కొట్టిన ధోని..
Ishan Kishan said, “I straightaway called Abhishek Sharma after the auction and asked, ‘what are you guys expecting? Do I’ve to hit each and every ball?’ he replied, ‘absolutely, that is your job'”. pic.twitter.com/u4pVnHwWVr
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2025
సన్‌రైజర్స్ ఏం ఆశిస్తుందో తెలుసుకున్న ఇషాన్.. అందుకు తగ్గట్లుగానే వచ్చిరావడంతో తొలి మ్యాచ్‌లోనే అదిరిపోయే ఆటతీరును ప్రదర్శించాడు.