Nitish Kumar Reddy: క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ పాదాలకు నమస్కరించిన నితీశ్ కుటుంబ సభ్యులు.. వీడియో వైరల్

నితీశ్ కుమార్ రెడ్డిని ప్రశంసించిన గవాస్కర్.. ఓ కీలక సూచన కూడా చేశాడు. నితీశ్ ఈ స్థాయికి చేరుకోవడానికి అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో త్యాగం చేసి ఉంటారని, దానిని ఎప్పటికీ గుర్తుకోవాలని సూచించారు.

Nitish Kumar Reddy Father mutyala reddy

Nitish Kumar Reddy Family: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్ వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్ల మధ్య నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆల్ రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 474 పరుగులు చేయగా.. భారత్ జట్టు ఆటగాళ్లు తక్కువ పరుగులకే వరుసగా వికెట్లు కోల్పోయారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడుతూ అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ చేశారు. తద్వారా టీమిండియా జట్టును ఫాలోఆన్ గండం నుంచి బయటపడేశాడు. అయితే, నితీశ్ కుమార్ కు టెస్టులో ఇది తొలి సెంచరీ కావడం గమనార్హం. మొత్తం 189 బంతులు ఎదుర్కొన్న నితీశ్ కుమార్ 114 పరుగులు చేశాడు. అందులో 11 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.

Also Read: IND vs AUS: నాల్గో టెస్టు.. ఆస్ట్రేలియాపై పట్టుబిగిస్తున్న భారత్.. బుమ్రా, సిరాజ్ సూపర్ బౌలింగ్

ప్రపంచ స్థాయి పేసర్లను ఎదుర్కొని..
టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన నితీశ్ కుమార్ తన అద్భుత బ్యాటింగ్ తీరుతో దిగ్గజ క్రికెటర్ల ప్రశంసలు అందుకున్నాడు. నితీశ్ ఆటతీరు పట్ల భారత్ లోని క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లు స్టార్క్, కమిన్స్, బోలాండ్ లాంటి ప్రపంచ స్థాయి పేసర్లు స్వింగ్, బౌన్స్ తో హడలెత్తిస్తున్నప్పటికీ.. నితీశ్ కుమార్ ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తూ క్రీజులో పాతుకుపోయాడు. ఒక్కోసారి దూకుడుగా ఆడుతూ మరికొద్దిసేపు నెమ్మది ఆడుతూ అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Also Read: తన తండ్రిని బంధువులు హేళన చేస్తుండగా విన్న నితీశ్ కుమార్‌.. అందుకే ఇప్పుడు బాహుబలి స్టైల్‌లో సెలబ్రేషన్స్‌

అంబరాన్ని తాకే సంబరం..
ఆస్ట్రేలియా పేసర్లు బౌలింగ్ ను తట్టుకోవటం సీనియర్ బ్యాటర్లకుసైతం కష్టతరంగానే ఉంటుంది. అందులోనూ బౌలింగ్ కు సహకరించే పిచ్ పై అయితే ఇకఅంతే. ఆసీస్ బౌలర్లు చెలరేగిపోతారు. మెల్బోర్న్ స్టేడియంలో మూడురోజు ఆటలోనూ అదే పరిస్థితి ఉంది. నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బౌలర్లు విజృంభిస్తున్న క్రమంలో నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత బ్యాటింగ్ తీరును కనబర్చాడు. అవసరాన్ని బట్టి దూకుడుగా ఆడతూ.. ఆఫ్ సెంచరీ చేశాడు. ఆ సమయంలో బ్యాట్ ను గడ్డం కింద నుంచి తిప్పుతూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తరహాలో బ్యాట్ తో సంజ్ఞ చేశాడు. అంతటితో ఆగకుండా సెంచరీని సైతం నితీశ్ కుమార్ పూర్తి చేశాడు. ఆ సమయంలో నేలపై ఒక మోకాలితో కూర్చొని బ్యాట్ ను నిలబెట్టి దానిపై హెల్మెంట్ ఉంచి ఆకాశంవైపు చేయిని ఎత్తిచూపుతూ బాహుబలి సినిమాలో ప్రభాస్ తరహాలో తన ఆనందాన్ని నితీశ్ వ్యక్తపర్చాడు.

Also Read: Nitish Reddy Pics: హాఫ్ సెంచరీ చేశాక పుష్ప స్టైల్‌లో తగ్గేదే లే అన్నాడు.. సెంచరీ చేశాక బాహుబలి స్టైల్‌లో రాజసం

గవాస్కర్ పాదాలకు నమస్కారం ..
నితీశ్ కుమార్ సెంచరీతో కుటుంబ సభ్యుల సంబరాలు అంబరాన్నంటాయి. కొడుకు టీమిండియా జెర్సీ వేసుకుని మైదానంలో ఆడుతుంటే.. స్టేడియంలో నితీశ్ కుమార్ తండ్రి ముత్యాల రెడ్డి, కుటుంబ సభ్యులు సంబరాలు అంబరాన్ని తాకాయి. ముఖ్యంగా నితీశ్ తొలి అంతర్జాతీయ శతకం చేసిన సమయంలో అతని తండ్రి ముత్యాల రెడ్డి స్టేడియంలో తీవ్ర బావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం తల్లిదండ్రులు, సోదరిని హోటల్ లో నితీశ్ ను కలిసి సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకుముందు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ను నితీశ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. ఆ సమయంలో నితీశ్ కుమార్ తండ్రి, తల్లి, అతని సోదరి గవాస్కర్ పాదాలకు నమస్కారం చేశారు. ముత్యాల రెడ్డి కాళ్లకు నమస్కారం చేస్తున్న సమయంలో గవాస్కర్ వారించినప్పటికీ.. సార్.. సార్.. మీరు గొప్ప క్రికెటర్ అంటూ నితీశ్ కుటుంబ సభ్యులు గవాస్కర్ పాదాలకు నమస్కారం చేశారు. అనంతరం గవాస్కర్ ముత్యాల రెడ్డిని హత్తుకొని అభినందించారు. కొద్దిసేపు నితీశ్ కుటుంబ సభ్యులు గవాస్కర్ తో తమ సంతోషాన్ని వెలుబుచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన టీమిండియా ఫ్యాన్స్ నితీశ్ కుటుంబ సభ్యుల తీరుపట్ల ఫిదా అవుతున్నారు.

అంతకుముందు నితీశ్ కుమార్ రెడ్డిని ప్రశంసించిన గవాస్కర్.. ఓ కీలక సూచన కూడా చేశాడు. నితీశ్ ఈ స్థాయికి చేరుకోవడానికి అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో త్యాగం చేసి ఉంటారని, దానిని ఎప్పటికీ గుర్తుకోవాలని సూచించారు. నితీశ్ ఇదే ఆటతీరును కొనసాగిస్తే కెరీర్ అద్భుతంగా సాగుతుందని గవాస్కర్ పేర్కొన్నారు.