Tilak Varma
Tilak Varma : ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ప్లేయర్లు నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నా పట్ల దురుసుగా ప్రవర్తించి నా ఏకాగ్రతను దెబ్బతీసేందుకు యత్నించారని టీమిండియా యువ ప్లేయర్ తిలక్ వర్మ అన్నారు.
ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. హైదరాబాద్ కుర్రాడు, టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ (69నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో దేశవ్యాప్తంగా తిలక్ వర్మ ఆటతీరుపై ప్రశంసల వర్షం కురుస్తుంది. సోమవారం రాత్రి తిలక్ వర్మ హైదరాబాద్ చేరుకున్నాడు. విమానాశ్రయం వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాగా.. మంగళవారం ఉదయం తిలక్ వర్మ లింగంపల్లిలోని లేగల గ్రౌండ్ కు వచ్చారు. అక్కడ శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో ముచ్చటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Also Read: Team India : పాక్ మీద గెలిచిన ఆనందంలో ఉన్న ఇండియాకి భారీ షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..
క్రికెట్ ను ఎమోషనల్ గా తీసుకోవద్దు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నాపై ఒత్తిడి పెంచాలని చూశారు. అయినా ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. నా కళ్ల ముందు దేశం కనిపించింది. మ్యాచ్ ఫినిష్ చేస్తాననే ఆత్మవిశ్వాసంతో ఉన్నా. చివరి వరకు అదే విశ్వాసంతో ఆడా. ఆసియా కప్ గెలవడం ఆనందాన్ని ఇచ్చింది. ఈ విజయం భారత జవాన్లకు అంకితం అని తిలక్ వర్మ అన్నారు. జనవరిలో వరల్డ్ కప్ టోర్నమెంట్ వస్తుంది.. అదే నా టార్గెట్ అని చెప్పారు.
ప్రతి మ్యాచ్‌లో మా వ్యూహాలు మార్చుకుంటూ గెలుపుకోసం కృషిచేశాం. జట్టు సభ్యులు అందరం సమిష్టిగా కష్టపడ్డాం. చాలా ఒత్తిడిలోనే నేను బ్యాటింగ్ చేశా. దేశాన్ని గెలిపించాలన్న లక్ష్యంతోనే ఆడాను అని తిలక్ వర్మ వివరించారు. నా చిన్నతనం నుంచి నా తల్లిదండ్రులు, నా కోచ్‌లు ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి ఎదిగాను.. ప్రస్తుతం ఈ క్రెడిట్ అంతా వారిదేనని తిలక్ వర్మ చెప్పారు.