×
Ad

IND vs WI 2nd Test : విజ‌యానికి చేరువ‌లో భార‌త్‌.. ముగిసిన నాలుగో రోజు ఆట‌.. య‌శ‌స్వి జైస్వాల్ విఫ‌లం

ఢిల్లీ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో (IND vs WI 2nd Test) భార‌త్ విజ‌యం దిశ‌గా దూసుకువెలుతోంది.

Team India need 58 runs to win second test against west indies

IND vs WI 2nd Test : ఢిల్లీ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం దిశ‌గా దూసుకువెలుతోంది. 121 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోయి 63 ప‌రుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (25), సాయి సుద‌ర్శ‌న్ (30)లు ఉన్నారు. భార‌త విజ‌యానికి ఇంకా 58 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.

య‌శ‌స్వి జైస్వాల్ విఫ‌లం..
121 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. విండీస్ ఎడ‌మ చేతి వాటం స్పిన్న‌ర్ జోమెల్ వారికన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు య‌త్నించి ఆండర్సన్ ఫిలిప్ క్యాచ్ అందుకోవ‌డంతో య‌శ‌స్వి జైస్వాల్ (8) పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 9 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ తొలి వికెట్‌ను కోల్పోయింది.

Shai Hope : 2967 రోజుల త‌రువాత టెస్టుల్లో షై హోప్ సెంచ‌రీ.. వెస్టిండీస్ త‌రుపున ఆల్‌టైమ్ రికార్డు..

ఆ త‌రువాత వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన సాయి సుద‌ర్శ‌న్‌తో క‌లిసి కేఎల్ రాహుల్ విండీస్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నాడు. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ఈ జోడి బంతిని బౌండ‌రీకి త‌ర‌లించింది. నాలుగో రోజు మ‌రో వికెట్ ప‌డ‌కుండా రోజును ముగించింది.

390 ఆలౌట్‌..

ఓవర్‌నైట్‌ 173/2 స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొన‌సాగించిన విండీస్ అద్భుతంగా పోరాడింది. మ‌రో 217 ప‌రుగులు జోడించి మిగిలిన 8 వికెట్ల‌ను కోల్పోయింది. కాంప్‌బెల్ (115), షై హోప్ (103) శ‌త‌కాలు చేశారు. జస్టిన్ గ్రీవ్స్ (50*), రోస్టన్ ఛేజ్ (40), జైడెన్ సీల్స్ (32) లు రాణించారు. గ్రీవ్స్‌, సీల్స్ ప‌దో వికెట్‌కు 79 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్, బుమ్రాలు చెరో మూడు వికెట్లు తీశారు. సిరాజ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ర‌వీంద్ర జ‌డేజా, వాషింగ్ట‌న్ సుంద‌ర్ చెరో వికెట్ సాధించారు.

Smriti Mandhana : భార‌త్ మ్యాచ్ ఓడిపోయినా.. స్మృతి మంధాన ప్ర‌పంచ రికార్డులు..

270 ప‌రుగుల ఆధిక్యం..
అంత‌క‌ముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 518/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఆ త‌రువాత విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో భార‌త్‌కు 270 ప‌రుగుల కీల‌క తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 ప‌రుగులు చేయ‌గా.. భార‌త్ ముందు 121 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.