Team India players get one month rest after England series
ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందజేసింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీమ్ఇండియా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో భారత జట్టు తదుపరి ఆడబోయే సిరీస్‌లపై ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ఇంగ్లాండ్ సిరీస్ ముగియడంతో తదుపరి భారత జట్టు ఏ దేశంతో సిరీస్ ఆడనుంది అనే దానిపై అందరి దృష్టి పడింది. భారత జట్టు సెప్టెంబర్ 10నే మరో మ్యాచ్ ఆడనుంది.
Team India : ఒకే ఒక్క సిరీస్.. అటు కోహ్లీ, ఇటు రోహిత్ శర్మ వారసుడు దొరికేశాడు..!
అంటే నెలరోజులకు పైగానే భారత ఆటగాళ్లకు విశ్రాంతి లభించనుంది. ఆగస్టు నెలలో బంగ్లాదేశ్ టూర్ వాయిదా పడడంతోనే భారత ఆటగాళ్లకు సుదీర్ఘ విరామం దొరికింది. సెప్టెంబర్‌లో భారత జట్టు ఆసియా కప్ ఆడనుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుండతో ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.
యూఏఈ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు లేకుండానే భారత్ ఆడనుంది. వీరిద్దరు ఇప్పటికే టీ20, టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసియా కప్‌లో భారత్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో ఆడనుంది.
ఆసియా కప్‌లో గ్రూప్ స్టేజీలో భారత షెడ్యూల్ ఇదే..
* సెప్టెంబర్ 10న యూఏఈతో
* సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో
* సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆడనుంది. ఆ తరువాత సూపర్-4 మ్యాచ్‌లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.
ఆసియా కప్ తరువాత స్వదేశంలో భారత్.. వెస్టిండీస్ జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. తొలి టెస్టు మ్యాచ్ అక్టోబర్ 2 నుంచి 6 వరకు అహ్మదాబాద్ వేదికగా, రెండో టెస్టు అక్టోబర్ 10 నుంచి 14 వరకు ఢిల్లీ వేదికగా జరగనుంది.
ఆసీస్ పర్యటన..
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆసీస్ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌తోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు మైదానంలో అడుగుపెట్టనున్నారు.