ENG vs IND : అందువల్లే ఐదో టెస్టులో ఓడిపోయాం.. లేదంటేనా.. జట్టు మొత్తం.. బెన్‌స్టోక్స్ కీలక వ్యాఖ్యలు..
మ్యాచ్ అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ.. ఆఖరి టెస్టులో ఓడిపోవడం తనను బాధించిందన్నాడు.

Ben Stokes Comments after england lost 5th test against india
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 2-2తో సమమైంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భుజం గాయం కారణంగా ఇంగ్లాండ్ రెగ్యులర్ టెస్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఆడలేదు. అయినప్పటికి మ్యాచ్ అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ.. ఆఖరి టెస్టులో ఓడిపోవడం తనను బాధించిందన్నాడు.
మ్యాచ్ ఆడకుండా డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కావడం చాలా కష్టంగా ఉందన్నాడు. ఐదో టెస్టు గురించి మాట్లాడుతూ.. ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా పోరాడాయన్నాడు. ఈ మ్యాచ్ కూడా ఐదు రోజుల పాటు సాగిందన్నాడు. చివరి వరకు పోరాడినా ఈ మ్యాచ్‌లో గెలవకపోవడం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. అయినప్పటికి ఇంగ్లాండ్ జట్టు పట్ల గర్వపడుతున్నట్లు చెప్పాడు.
ఎడమ చేతిని స్లింగ్‌లో పెట్టుకుని బ్యాటింగ్‌కు వచ్చిన క్రిస్‌వోక్స్ పై బెన్‌స్టోక్స్ ప్రశంసలు కురిపించాడు. “క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు దిగడం అద్భుతం. ఇక నిన్న మొత్తం గాయమైన చేతితో అతడు ఎలా బ్యాటింగ్ చేయగలడా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇరు జట్లలోనూ విరిగిన చేతులు, కాళ్లతో ఆడిన ఆటగాళ్లు ఉన్నారు. ఇది వారి దేశం తరుపున ఆడడం ఎంతో ముఖ్యమో తెలియజేస్తుంది.” అని స్టోక్స్ అన్నాడు.
‘ఈ సిరీస్‌లో మైదానంలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు కొన్ని సార్లు సహనం కోల్పోయారు. ఇలాంటి ఘటనల పట్ల మేం ఏడుస్తూ కూర్చోము. అలాగే భారత ఆటగాళ్లు కూడా అంతే. ఆటలో అదంతా భాగమే. నిజం చెప్పాలంటే మైదానం బయట మేమంతా స్నేహితులమే. క్రికెట్ అభిమాని కోణంలో సిరీస్ 2-2తో ముగియడం సరైందే. కానీ కోరుకున్న ఫలితం రానందుకు మేం నిరాశచెందాం. జట్టులో అందరు అసహనంతో ఉన్నారు.’ అని స్టోక్స్ తెలిపాడు.
మ్యాచ్ ఆరంభంలోనే కీలక పేసర్ గాయపడడంతో తమ ప్రణాళికలు మొత్తం మారిపోయాయని చెప్పాడు. అయినప్పటికి రెండో ఇన్నింగ్స్‌లో తమ బౌలర్లు చూపించిన పోరాటం అద్భుతం అని అన్నాడు. వోక్స్ గాయపడడమే మా విజయావకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఏదీ ఏమైనప్పటికి మిగిలిన బౌలర్లు చాలా గొప్ప ప్రదర్శన చేశారన్నాడు. ప్రస్తుతం తాను గాయం నుంచి కోలుకుంటున్నానని, యాషెస్ సిరీస్ సిరీసే తదుపరి లక్ష్యం అని స్టోక్స్ అన్నాడు.