ENG vs IND : సిరీస్‌ను 2-2తో సమం చేయడం పై టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కామెంట్స్.. ఆ ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నా..
ఇంగ్లాండ్ పర్యటనను భారత జట్టు అద్భుత విజయంతో ముగించింది.

Shubman Gill Comments after india win 5th test against england
ఇంగ్లాండ్ పర్యటనను భారత జట్టు అద్భుత విజయంతో ముగించింది. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2 తో సమం చేసింది.
374 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్ నైట్ స్కోరు 339/6తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ టీమ్ఇండియా పేసర్ సిరాజ్ ధాటికి 367 పరుగులకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 396 పరుగులు సాధించింది. సిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా, శుభ్‌మన్ గిల్, బ్రూక్ లు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులను దక్కించుకున్నారు.
ఓవల్‌లో అద్భుత విజయంతో పాటు సిరీస్‌ను సమం చేయడం పై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. సిరీస్‌ను గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ.. ఈ సిరీస్ మొత్తం కూడా రెండు జట్లు అసాధారణ ప్రదర్శన చేశాయన్నాడు. ఐదో టెస్టు మ్యాచ్ ఆఖరి రోజు విషయానికి వస్తే.. ఇరు జట్లుకు విజయం సాధించేందుకు అవకాశం ఉందన్నాడు. ఉత్కంఠ పోరులో తాము పై చేయి సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు.
ఇక ప్రతి కెప్టెన్ కోరుకునే పేసర్ సిరాజ్ అని చెప్పాడు. తన బౌలింగ్‌లో ప్రతి స్పెల్, ప్రతి బంతిని జట్టు కోసం ఇచ్చాడన్నారు. ఇక ప్రసిద్ద్ కూడా చాలా చక్కగా వేశాడని చెప్పుకొచ్చాడు. వారిద్దరూ మ్యాచ్ విన్నింగ్ స్పెల్ బౌలింగ్ చేశారన్నాడు. ఇక కొత్త బంతి అందుబాటులో ఉన్నప్పటి కూడా పాత బంతితో బౌలింగ్ చేయడం గురించి మాట్లాడుతూ.. పాత బంతితో ఎటువంటి సమస్యలేదని అనిపించిందన్నాడు. ఆ బంతి రెండు వైపులా అద్భుతంగా మూమెంట్ ఉండడంతోనే కొత్త బంతిని తీసుకోలేదన్నాడు.
ఇక సిరీస్ 2-2తో ముగియడం.. ఇరు జట్ల ఉత్సాహం, ప్రదర్శనకు నిదర్శనం. సిరాజ్, ప్రసిద్ధ్ లాంటి బౌలర్లు ఉన్నప్పుడు కెప్టెన్సీ సులభం అవుతుందన్నాడు. ఆదివారం కూడా విజయం పై నమ్మకంతో ఉన్నామని, సోమవారం ఆటగాళ్లు స్పందించిన విధానం అద్భుతం అని చెప్పాడు.
ఇక సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడం పట్ల మాట్లాడుతూ.. ఈ సిరీస్ ఆరంభానికి ముందు బెస్టు బ్యాటర్‌గా ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇప్పుడు దాన్ని అందుకున్నాను అని గిల్ అన్నాడు.