Team India : ఒకే ఒక్క సిరీస్.. అటు కోహ్లీ, ఇటు రోహిత్ శర్మ వారసుడు దొరికేశాడు..!
వారం రోజుల వ్యవధిలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు.

Shubman Gill replaces Rohit Sharma and Virat Kohli
ఇంగ్లాండ్ పర్యటనకు సరిగ్గా నెల రోజుల ముందు భారత జట్టుకు ఊహించిన షాకులు తగిలాయి. వారం రోజుల వ్యవధిలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీంతో ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ఇండియా ఎలా రాణిస్తుంది ? రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో ఎవరు బాధ్యతలు చేపడుతారు? కీలక మైన నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారు? అసలు ఇంగ్లాండ్ జట్టుకు మన జట్టు కాస్త అయినా పోటీ ఇస్తుందా? వంటి ప్రశ్నలు ఉదయించాయి.
కట్ చేస్తే.. ఇంగ్లాండ్ సిరీస్‌లో టీమ్ఇండియా యువ ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన చేశారు. సిరీస్‌ను 2-2తో సమం చేశారు. ఓడిపోయిన రెండు మ్యాచ్‌ల్లో కూడా భారత ఆటగాళ్లు గొప్పగా పోరాడారు అన్న సంగతి మరువరాదు. దీంతో సీనియర్లు రోహిత్, కోహ్లీ లేని లోటును అధిగమించినట్లే కనిపిస్తోంది.
అటు కెప్టెన్‌గా, ఇటు నాలుగో స్థానంలో..
రోహిత్ శర్మ స్థానంలో టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ బాధ్యతలు చేపట్టాడు. అయితే.. దేశవాళీతో పాటు అంతర్జాతీయ క్రికెట్ లో అతడికి కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే నాయకత్వం వహించిన అనుభవం ఉంది. దీంతో అతడి సారథ్యంలో ఇంగ్లాండ్‌లో భారత్ ఎలా ఆడుతుందోనని ఫ్యాన్స్‌తో పాటు మాజీ ఆటగాళ్లు కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. సీనియర్ ఆటగాళ్లు అయిన పంత్, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రాలలో ఎవరో ఒకరికి కెప్టెన్సీ ఇస్తే.. బాగుండేదని అభిప్రాయ పడ్డారు.
అయితే.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో గిల్ తన అద్భుతమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. ఎంతో ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకున్నాడు. అవసరం అనుకుంటే కోహ్లీలాగా దూకుడు కూడా చూపించాడు. మొత్తంగా తొలి సిరీస్‌లోనే కెప్టెన్‌గా గిల్ తనదైన ముద్ర వేశాడు. ఇప్పటికిప్పుడే అతడు మేటి సారథి అని చెప్పడం లేదుగానీ.. అనుభవంతో అతడు ఓ గొప్ప కెప్టెన్‌గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే అతడు మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియాను నడిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
నాలుగో స్థానానికి సరైనోడు..?
కోహ్లీ టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించక ముందు కొన్నేళ్ల పాటు అతడు సుదీర్ఘ ఫార్మాట్‌లో నాలుగో స్థానంలో ఆడుతూ జట్టు బాధ్యతలను తన భుజాలపై మోశాడు. అతడు రిటైర్‌మెంట్ ప్రకటించగానే నాలుగో స్థానంలో ఆడే ఆటగాడు ఎవరు అన్న ప్రశ్న మొదలైంది.
టెస్టుల్లో నాలుగో స్థానం ఎంతో ప్రత్యేకమైంది. అతడు టాప్ ఆర్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు భారీ స్కోరును అందించాల్సి ఉంటుంది. కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో ఆడాలని డిసైడ్ అయ్యాడు.
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన గిల్.. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతూ పరుగుల వరద పారించాడు. 5 మ్యాచ్‌ల్లో 75.40 సగటుతో 754 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. గిల్ ఇక ముందు కూడా ఇలాగే ఆడితే కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం అతడికి పెద్ద కష్టం ఏమీ కాదు.