IPL 2026 : వ‌చ్చే సీజ‌న్‌లో ఈ ముగ్గ‌రు ఆట‌గాళ్లు ఫ్రాంచైజీలు మార‌డం ఖాయమేనా?

ఐపీఎల్ 2026 సీజ‌న్ ప్రారంభానికి ఇంకో ఎనిమిది నెల‌ల స‌మయం ఉంది.

These Three Players Might Wear New Jerseys in IPL 2026 Season

ఐపీఎల్ 2026 సీజ‌న్ ప్రారంభానికి ఇంకో ఎనిమిది నెల‌ల స‌మయం ఉంది. అయినా కూడా ఇప్ప‌టి నుంచే అన్ని ఫ్రాంఛైజీలు కొత్త సీజ‌న్ కోసం సిద్ధ‌మ‌వుతున్నాయి. గ‌త సీజ‌న్ ముగిసిన వెంట‌నే ట్రేడ్ విండో ప్రారంభమైంది. ఈ క్ర‌మంలో ఆట‌గాళ్ల‌ను ట్రేడ్ విండో ద్వారా భ‌ర్తీ చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది.

అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. సంజూశాంస‌న్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు భార‌త ఆట‌గాళ్లు వ‌చ్చే సీజ‌న్‌లో ఫ్రాంఛైజీ మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

సంజూ శాంస‌న్‌..
ఐపీఎల్‌లో గ‌త కొన్నాళ్లుగా సంజూ శాంస‌న్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. ఆ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే.. ఈ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కోసం చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అత‌డిని ట్రేడ్ ద్వారా కొనుగోలు చేయాల‌ని భావిస్తుంద‌ట‌. ఎంఎస్ ధోని వ‌చ్చే సీజ‌న్‌లో ఆడ‌డం అనుమానం అని, అందుక‌నే అనుభ‌వ‌జ్ఞుడైన, న‌మ్మ‌క‌మైన వికెట్ కీప‌ర్ కోసం సీఎస్‌కే వెతుకుతోంద‌ట‌. ఈ క్ర‌మంలోనే సంజూ పై దృష్టి సారించిన‌ట్లు స‌మాచారం.

Rishabh Pant : రిష‌బ్ పంత్ స్థానంలో మ‌రో ఆట‌గాడు బ్యాటింగ్ చేయొచ్చా.. నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయ్‌?

ఇషాన్ కిష‌న్‌..
ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఇషాన్ కిష‌న్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించాడు. 14 మ్యాచ్‌ల్లో 354 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ శ‌త‌కం కూడా ఉంది. అయితే.. నివేదిక‌ల ప్ర‌కారం వ‌చ్చే సీజ‌న్‌లో అత‌డు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌రుపున ఆడొచ్చు. కేకేఆర్ వారి బ్యాటింగ్ లైన‌ప్ బ‌లోపేతం చేయ‌డంతో పాటు నాణ్య‌మైన వికెట్ కీపర్ కోసం వెతుకుతోంది. ఈ క్ర‌మంలోనే కిష‌న్‌ను ట్రేడ్ విండో ద్వారా కొనుగోలు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

వెంక‌టేష్ అయ్య‌ర్‌..
ఐపీఎల్ 2025 మెగా వేలంలో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ రూ.23.75 కోట్లు వెచ్చించి మ‌రీ సొంతం చేసుకుంది. అయితే.. ఈ సీజ‌న్‌లో వెంక‌టేష్ అయ్య‌ర్ పెద్ద‌గా రాణించ‌లేదు. 21 స‌గ‌టుతో 142 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో అత‌డిని వ‌దులుకునేందుకు కేకేఆర్ సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Shubman Gill : స్టోక్స్‌ అప్పీల్‌ చేయడం.. అంపైర్‌ ఔట్‌ ఇవ్వడం.. చ‌క చ‌కా జ‌రిగిపోయాయ్‌.. గిల్ స‌మీక్ష కోర‌గా..

మ‌రోవైపు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు బ్యాట్‌, బంతితో రాణించే భార‌త ఆల్‌రౌండ‌ర్ కోసం వెతుకుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ట్రేడ్ విండో ద్వారా కేకేఆర్‌, హైద‌రాబాద్ జ‌ట్లు వెంక‌టేష్ అయ్య‌ర్, ఇషాన్ కిష‌న్‌ల‌ను మార్చుకోనున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. అయితే.. మ‌రికొద్ది రోజుల్లోనే దీనిపై స్ప‌ష్ట‌త రానుందని అంటున్నారు.