These Three Team India players not getting chance in England test series
లండన్‌లోని ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు ఐదో టెస్టు మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఇప్పటికే సిరీస్‌లో 1-2 తేడాతో వెనుకబడిన భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో గెలిచినా, డ్రా చేసుకున్నా కూడా సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. క్రీజులో కరుణ్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19)లు క్రీజులో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణలకు ఆడే ఛాన్స్ వచ్చింది. అయితే.. ఈ సిరీస్‌కు ఎంపికైనప్పటికి కూడా ఓ ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించలేదు. ఆ ముగ్గురు మరెవరో కాదు.. కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అభిమన్యు ఈశ్వరన్.
కుల్దీప్ యాదవ్ : ఇంగ్లాండ్ పర్యటనకు ఏకైక స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఎంపిక అయ్యాడు. దీంతో అతడు ఇంగ్లాండ్ పర్యటనలో కీలక పాత్ర పోషిస్తాడని, ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు మ్యాచ్‌లు ఆడతారని అంతా భావించారు. అయితే.. అలా జరగలేదు. ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు ఉండడంతో కుల్దీప్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు.
అర్ష్‌దీప్ సింగ్ : ఈ యువ ఆటగాడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత కీలక బౌలర్‌గా ఉన్నాడు. అయినప్పటికి ఇప్పటి వరకు అతడు టెస్టు అరంగ్రేటం చేయలేదు. ఇంగ్లాండ్‌కు పర్యటనకు ఎంపిక చేయడంతో కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఆడే అవకాశం వస్తుందని, అతడి అరంగ్రేటం ఖాయం అని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.
ఓవల్ మ్యాచ్‌కు బుమ్రా లేకపోవడంతో కనీసం ఐదో మ్యాచ్‌లోనైనా అతడికి స్థానం దక్కుతుందని భావించగా.. హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ లు ప్రసిద్ధ్ కృష్ణ పైనే నమ్మకం ఉంచడంతో అర్ష్‌దీప్ సింగ్ మరోసారి బెంచీకే పరిమితం కాకతప్పలేదు. దీంతో అతడు టెస్టు అరంగ్రేటం కోసం మరికొన్నాళ్లు ఆగకతప్పేలా లేదు.
అభిమన్యు ఈశ్వరన్ : ఈ యువ ఆటగాడిని ఇంగ్లాండ్ పర్యటనకు రిజర్వ్ ఓపెనర్‌గా తీసుకున్నారు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ లు ఉండడంతో ఈ యువ ఆటగాడికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు.
ENG vs IND : ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్.. భారత బ్యాటర్లకు ఇక పండగేనా?
29 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్ దేశవాళీ క్రికెట్‌లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. దాదాపు మూడేళ్లుగా టీమ్ఇండియా ఆడే టెస్టు సిరీస్‌లకు ఎంపిక అవుతున్నా కూడా తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. ఇతడు కూడా ఇంకా టెస్టు అరంగ్రేటం చేయలేదు. ఇతడికి తుది జట్టులో చోటు ఎప్పుడు దక్కుతుందో వేచి చూడాల్సిందే.
దీంతో ఈ ముగ్గరు ఆటగాళ్లు బ్యాగ్ లు మోయడానికి మాత్రమే ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కనీసం వీరికి ఒక్క మ్యాచ్‌లోనైనా ఆడే అవకాశం ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు.