ENG vs IND : ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్.. భారత బ్యాటర్లకు ఇక పండగేనా?
బంతిని ఆపే క్రమంలో డైవ్ చేసిన వోక్స్ భుజానికి గాయమైంది.

ENG vs IND 5th test Chris Woakes unlikely to bowl again in this match
లండన్‌లోని ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు ఐదో టెస్టు మ్యాచ్‌లో తలపడుతున్నాయి. తొలి రోజు ఆట సందర్భంగా ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ క్రిస్ వోక్స్ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో డైవ్ చేసిన వోక్స్ భుజానికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు.
తొలి రోజు ఆఖరి సెషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్ 57వ ఓవర్‌ను జేమీ ఓవర్టన్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఐదో బంతిని కరుణ్ నాయర్ మిడాఫ్ దిశగా షాట్ ఆడాడు. బంతి బౌండరీ దిశగా వెలుతుండగా క్రిస్‌వోక్స్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ బంతి ఫోర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఈ సమయంలో అతడి ఎడమ భుజం బలంగా నేలను తాకింది.
దీంతో అతడు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. వెంటనే ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించాడు. అయినప్పటికి ఎలాంటి ఫలితం లేకపోవడంతో వోక్స్ మైదానాన్ని వీడాడు. కాగా.. అతడి భుజం డిస్ లోకేట్ అయినట్లుగా తెలుస్తోంది. అతడిని స్కానింగ్ కోసం ఆస్పత్రికి తరలించారు. అతడికి గాయం తీవ్రమైనది అయితే అతడు ఈ మ్యాచ్‌లో ఇక బౌలింగ్ చేయకపోవచ్చు. అతడు ఇప్పటికే కీలకమైన కేఎల్ రాహుల్ వికెట్ పడగొట్టాడు.
గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌కు సీనియర్ పేసర్ అయిన వోక్స్ దూరం అయితే అది ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అప్పుడు ఇంగ్లాండ్‌కు ఓ పేసర్ తక్కువ అవుతాడు. అది ఇండియాకు లాభం చేకూరుస్తుంది.
WCL 2025 : డబ్ల్యూసీఎల్ టోర్నీ నుంచి భారత్ వాకౌట్.. ఫైనల్‌కు పాక్..
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19) లు క్రీజులో ఉన్నారు.