IND vs ENG: ఇదేం అంపైరింగ్ సామీ.. ఇది న్యాయమేనా..! ఓవల్‌లో ఇంగ్లాండ్‌కు అనుకూలంగా సిగ్నల్ ఇచ్చిన లంక అంపైర్.. వీడియో వైరల్.. ఐసీసీ వేటు తప్పదా..?

శ్రీలంకకు చెందిన అంపైర్ కుమార ధర్మసేన చేసిన సంజ్ఞకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

IND vs ENG: ఇదేం అంపైరింగ్ సామీ.. ఇది న్యాయమేనా..! ఓవల్‌లో ఇంగ్లాండ్‌కు అనుకూలంగా సిగ్నల్ ఇచ్చిన లంక అంపైర్.. వీడియో వైరల్.. ఐసీసీ వేటు తప్పదా..?

Kumar Dharmasena

Updated On : August 1, 2025 / 8:56 AM IST

India vs England Test umpire Kumar Dharmasena: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఐదో టెస్టు మ్యాచ్ ఓవల్ వేదికగా గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. తొలిరోజు ఆటలో అడపాదడపా కురిసిన వర్షం కారణంగా భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. దీంతో తక్కువ స్కోర్ కే కీలక బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టారు. అయితే, ఈ మ్యాచ్‌లో అంపైర్ కుమార ధర్మసేన నిర్ణయం వివాదాస్పదంగా మారింది.

Also Read: అయ్యో.. అలా చేశావేంటి గిల్.. ఒక్క రన్‌కోసం కొంపముంచావ్ కదయ్యా.. క్రీజులో ఉండిఉంటే.. వీడియో వైరల్

శ్రీలంకకు చెందిన అంపైర్ కుమార ధర్మసేన చేసిన తప్పుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా అంపైర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై వెంటనే ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందని ఓ సారి పరిశీలిస్తే..

భారత ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ బౌలింగ్ చేయగా.. క్రీజులో సాయి సుదర్శన్ ఉన్నాడు. ఆ ఓవర్లో ఓ బంతిని ఫుల్ టాస్ వేశాడు. వేగంగా వచ్చిన బంతిని ఎదుర్కొనే క్రమంలో సాయిసుదర్శన్ కిందపడిపోయాడు. అయితే, ఆ బంతి బ్యాట్‌కు తాకింది. ఈ విషయాన్ని గమనించని ఇంగ్లాండ్ ప్లేయర్లు బంతి నేరుగా ప్యాడ్లకు తగిలిందని భావించి ఎల్బీడబ్ల్యూ కోసం కాస్త గట్టిగానే అపీల్ చేశారు. కానీ, అంపైర్ కుమార ధర్మసేన 15 సెకన్ల డీఆర్ఎస్ టైమర్ ముగియక ముందే బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ అయిందని తన చేతి వేళ్లతో సంజ్ఞ చేశాడు. అంపైర్ సంజ్ఙను గమనించిన ఇంగ్లాండ్ కెప్టెన్ వెంటనే అలర్ట్ అయ్యాడు. రివ్యూకు వెళ్లలేదు.


ఒకవేళ ఇంగ్లాండ్ జట్టు డీఆర్ఎస్ కోరితే ఒక రివ్యూను కోల్పోయేది. కానీ, అంపైర్ ధర్మసేన సంజ్ఞతో వారు రివ్యూను కాపాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు అంపైర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, శ్రీలంక అంపైర్ కుమార ధర్మసేన నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినట్లు స్పష్టంగా వీడియోలో కనిపిస్తుండటంతో ఐసీసీ అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే, ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే.