Three or four likely changes in indias xi in 4th test aginst england
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో 1-2 తేడాతో వెనుకబడిన భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే.. భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది.
ఇప్పటికే టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి ఈ సిరీస్‌లోని మిగిలిన రెండు టెస్టులకు దూరం కాగా.. ప్రాక్టీస్‌లో గాయపడ్డ అర్ష్‌దీప్ సింగ్ నాలుగో టెస్ట్ ఆడడని బీసీసీఐ వెల్లడించింది. నితీశ్‌కుమార్ రెడ్డి స్థానంలో హరియానా పేసర్ అన్షుల్ కంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అటు మరో పేసర్ ఆకాశ్ దీప్ సైతం గాయంతో సతమతమవుతున్నాడు.
ఇంకోవైపు మూడో టెస్టులో వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతి వేలికి గాయమైన సంగతి తెలిసిందే. అతడు పూర్తి ఫిట్‌గా లేడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ బ్యాటర్‌గా మాత్రమే పంత్ ను ఆడించనున్నారని అంటున్నారు. ఈ క్రమంలో నాలుగో టెస్ట్ మ్యాచ్ తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి.
మాంచెస్టర్ పిచ్ మూడో రోజు నుంచి స్పిన్‌కు అనుకూలం అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నితీశ్‌కుమార్ రెడ్డి స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ నాలుగో టెస్ట్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుమ్రా, సిరాజ్‌లు కొనసాగనుండగా.. ఆకాశ్ దీప్ స్థానంలో అన్షుల్ కాంబోజ్ అరంగ్రేటం చేయనున్నట్లు తెలుస్తోంది.
పంత్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా తీసుకుంటే.. వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి రావడం ఖాయం. అతడు వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆడే అవకాశం ఉంది. 8 ఏళ్ల తరువాత భారత టెస్ట్ జట్టులో రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఆడిన మూడు టెస్ట్‌ల్లో ఘోరంగా విఫలం అయ్యాడు. అతడిని తొలగించాలని జట్టు మేనేజ్‌మెంట్ అనుకుంటే అతడి స్థానంలో సాయి సుదర్శన్ జట్టులోకి రావొచ్చు.
ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్/సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్