Tilak Varma defends Gambhir batting order experiments ahead of IND vs SA 3rd T20
IND vs SA : టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎన్ని మార్పులు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఓ ఆటగాడు ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో ఆడితే మరుసటి మ్యాచ్‌లో అతడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడో చెప్పలేని పరిస్థితి ఉంది. స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ అంటూ లేకపోవడంతోనే భారత జట్టు ఇటీవల మ్యాచ్‌లను ఓడిపోతుందని పలువురు మాజీలు సైతం బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు తిలక్ వర్మ హెడ్ కోచ్ గంభీర్‌కు మద్దతుగా మాట్లాడాడు.
ప్రస్తుత భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తిలక్ వర్మ చెప్పాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్‌కు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.
జట్టులో ఓపెనర్లు మినహా మిగిలిన వారంతా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నాడు. ఈ అంశం పై టీమ్‌మేనేజ్‌మెంట్ చాలా స్పష్టతతో ఉందన్నాడు. ఏ నిర్ణయం అయినా జట్టు కోసమే అని చెప్పుకొచ్చాడు. ఇక తన విషయానికి వస్తే.. వన్‌డౌన్ నుంచి ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలన్నా కూడా తాను సిద్ధమేనన్నాడు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు.
ధర్మశాలలో జరగనున్న మూడో టీ20 మ్యాచ్ పై స్పందించాడు. ధర్మశాలలో చాలా చలిగా ఉంటుందన్నాడు. అందుకు తగ్గట్లుగానే తాము సిద్ధం అవుతున్నామని చెప్పాడు. సాధారణంగా ఇక్కడి పిచ్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. అయినప్పటికి కూడా పరుగుల వరద ఖాయం అని చెప్పాడు.
‘నేను ఇక్కడ అండర్19 స్థాయిలో ఆడాను. పిచ్ పరిశీలిస్తే భారీ స్కోరు నమోదు అయ్యే అవకాశం ఉంది. పేసర్లు రాణించొచ్చు. ఇక టాస్ అనేది మన చేతుల్లో ఉండదు. చలి అధికంగా ఉంటుంది కాబట్టి బంతిపై పట్టు కోసం తడి బంతుతోనూ ప్రాక్టీస్ చేస్తున్నాం.’ అని తిలక్ తెలిపాడు.