Updated WTC 2025-2027 points table after ind vs sa 1st test
Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 124 పరుగుల లక్ష్య ఛేదనలో 93 పరుగులకే కుప్పకూలింది. దీంతో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక భారత గడ్డపై దక్షిణాఫ్రికాకు గత 15 ఏళ్లలో ఇదే తొలి టెస్టు విజయం కావడం గమనార్హం.
భారత్ పై టెస్టు మ్యాచ్ గెలవడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికాకు బాగా కలిసి వచ్చింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఐదో స్థానం నుంచి ఏకంగా రెండో స్థానానికి దూసుకువచ్చింది. డబ్ల్యూటీసీ 2027 సైకిల్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు విజయ శాతం 66.67గా ఉంది.
Sourav Ganguly : ఇప్పటికైనా మేల్కొ.. వెంటనే ఆ పని చేయ్.. గంభీర్‌కు సౌరవ్ గంగూలీ సూచన..
ఇక దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన భారత్ (Team India) మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ సైకిల్‌లో ఇప్పటి వరకు భారత్ 8 టెస్టులు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో గెలవగా, మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. భారత విజయశాతం 54.17గా ఉంది.
ఇక ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆస్ట్రేలియా 100 శాతం విజయశాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇక రెండు మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న శ్రీలంక జట్టు 66.67 విజయశాతంతో మూడో స్థానంలో నిలిచింది. ఇక ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో వరుసగా పాకిస్థాన్ (50.00), ఇంగ్లాండ్ (43.33), బంగ్లాదేశ్ (16.67) లు ఉన్నాయి. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోయిన వెస్టిండీస్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక ఈ సైకిల్‌లో ఇప్పటి వరకు న్యూజిలాండ్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.