Uthappa backed Kohli decision to play Vijay Hazare Trophy
Virat Kohli : ఇప్పటికే టీ20లు, టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించేశాడు. ప్రస్తుతం అతడు వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడడమే లక్ష్యంగా అతడు ముందుకు సాగుతున్నాడు. అయితే.. ఇప్పటికే బీసీసీఐ కొత్త నిబంధనను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవాలంటే ఆటగాళ్లు ఎవరైనా సరే అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని చెప్పింది.
అయినప్పటికి.. డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు విరాట్ కోహ్లీ తొలుత నిరాకరించాడని, కానీ సెలక్టర్ల కోరిక మేరకు ఆడేందుకు ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు. కోహ్లీ సరైన నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకొచ్చాడు. భారత మాజీ కెప్టెన్ బీసీసీఐ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ వెళ్లబోడని ఉతప్ప తన యూట్యూబ్ ఛానెల్‌లో వెల్లడించాడు.
‘విరాట్ కోహ్లీ.. విజయ్ హజారే ట్రోఫీలో ఆడతానని మూడు వారాల క్రితమే ధ్రువీకరించాడు. అతడు మంచి నిర్ణయం తీసుకున్నాడు. అతడు ఆడతాడా? లేదా ఆడడా? అనే విషయాలపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక కోహ్లీ ఎక్కువ మ్యాచ్‌లు ఆడే కొద్ది అతడు పరుగులు రాబట్టడం ఇంకా ఈజీ అవుతుంది. దేశవాళీల్లో ఆడితే అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ దొరుకుతుంది.’ అని ఉతప్ప అన్నాడు.
పోటీ క్రికెట్ ఆడకపోతే అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ ఎలా లభిస్తుందని ఉతప్ప ప్రశ్నించాడు. అతడి మానసిక సంసిద్ధతకు కూడా ఈ మ్యాచ్‌లు ఉపయోగపడతాయన్నాడు. ఇక గత 20 ఏళ్లుగా కోహ్లీ ఇలాగే చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు.
ఇక వన్డే క్రికెట్ లో విరాట్ కోహ్లీ మాస్టర్ అని, అయినప్పటికి కూడా విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే విషయంలో అతడికి, ముఖ్యమైన వ్యక్తులతో కమ్యూనికేషన్ అవసరం అని ఉతప్ప అన్నాడు.