Varun Chakravarthy
Varun Chakravarthy: ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ జట్టు 4-1 తో కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉంది. నాగపూర్ లో 6వ తేదీన తొలి వన్డే మ్యాచ్ జరగనుండగా.. టీమిండియా ప్లేయర్లు నెట్స్ లో ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, వన్డే జట్టులో టీం మేనేజ్మెంట్ కీలక మార్పు చేసింది. ఇటీవల వన్డే, ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అయితే, వన్డే జట్టులో వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేయలేదు. తాజాగా.. అతనికి జట్టులో స్థానం కల్పిస్తూ టీం మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించాడు. తన స్పిన్ మాయాజాలంతో 14 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. రాజ్ కోట్ లో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఐదు వికెట్లు తీశాడు. అయితే, వరుణ్ ఇప్పటి వరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో వరుణ్ సత్తాచాటితే ఈనెల 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ తుది జట్టులోకి అతను చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే, వన్డే జట్టులో అనూహ్యరీతిలో చోటుదక్కించుకున్న వరుణ్ చక్రవర్తి మంగళవారం టీమిండియా జట్టులో చేరి ప్రాక్టీస్ ను కూడా మొదలు పెట్టాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఇప్పటికే భారత్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో స్పిన్నర్లు జడేజా, అక్షర్ పటేల్, సుందర్, కుల్ దీప్ యాదవ్ ఎంపికయ్యారు. ఫిబ్రవరి 12వ తేదీలోపు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో వరుణ్ చక్రవర్తి రాణిస్తే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ చేరే అవకాశాలు ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి తుది జట్టులో చేరితే అక్షర్, సుందర్ లలో ఒకరిపై వేటు పడే అవకాశాలు లేకపోలేదు.
🚨 VARUN CHAKRAVARTHY ADDED TO INDIA’S SQUAD FOR THE ODI SERIES. 🚨 pic.twitter.com/Qf13IKCNDe
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 4, 2025
ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమాన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా