Varun Chakravarthy key comments ahead of Asia Cup 2025 team Selection
Varun Chakravarthy : సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మెగాటోర్నీ కోసం తన సన్నద్ధత, రీఎంట్రీ ఇచ్చిన తరువాత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లు ఇచ్చిన మద్ధతు గురించి టీమ్ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) మాట్లాడాడు. వన్డే ప్రపంచకప్ 2027లో చోటే లక్ష్యం అని తన మనసులోని మాట బయటపెట్టాడు.
వరుణ్ చక్రవర్తి ఇప్పటి వరకు 18 టీ20ల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 33 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది యూఏఈ వేదికగానే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు వరుణ్. అదే విధంగా ఆసియా కప్ 2025లో అతడు కీలక పాత్ర పోషిస్తాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న అతడికి తుది జట్టులోనూ చోటు దక్కడం ఖాయం అని అంటున్నారు.
Sanju Samson Net Worth 2025 : సంజూ శాంసన్ ఆస్తి ఎంతో తెలుసా? కోట్లలో జీతం.. రాజభవనం లాంటి ఇల్లు.!
యూఏఈ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడే ఆటగాళ్లకు ఐపీఎల్ తరువాత ఆసియా కప్‌లో ఆడేందుకు చాలా విరామం దొరికిందన్నాడు. తనకు దొరికిన సమయంలో తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఆడినట్లుగా చెప్పుకొచ్చాడు. అయినప్పటికి కూడా తనకు ఆట నుంచి నెలరోజులకు పైగా బ్రేక్ వచ్చిందన్నాడు. తనకు లభించిన విరామంలో తాను స్ట్రైంత్ అండ్ కండీషనింగ్‌పై ఫోకస్ పెట్టినట్లుగా చెప్పుకొచ్చాడు.
అదే సమయంలో తన ఫిట్‌నెస్, బ్యాటింగ్, బౌలింగ్ వంటివి మెరుగుపరచుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. ఇక కుటుంబంతో ఎంతో సమయం గడిపానని, మళ్లీ మైదానంలోకి దిగేందుకు సన్నద్ధం అవుతున్నట్లు చెప్పాడు.
ఆసియా కప్ తరువాత టీమ్ఇండియా చాలా పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడాల్సి ఉందన్నాడు. ఆసియా కప్‌లో రాణించి టీమ్ఇండియాలో సుస్థిర స్థానం సంపాదించి వన్డే ప్రపంచకప్ 2027లో ఆడడమే తన లక్ష్యం అని చక్రవర్తి తెలిపాడు. యూఏఈ వేదికగా ఆసియా కప్ జరగనుండడం తనకు కలిసి వస్తుందన్నాడు. మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు.
తన పునరాగమనంలో టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లు కీలక పాత్ర పోషించారని వరుణ చక్రవర్తి చెప్పాడు. వారిద్దరు ఇచ్చిన మోటివేషన్‌ను మరిచిపోలేమన్నాడు. ఎవరూ నిన్ను వదిలివేసినా కూడా నా ప్రణాళికల్లో నువ్వు ఉంటావు అని గంభీర్ చెప్పినట్లుగా వెల్లడించాడు.
గంభీర్ చెప్పిన మాటలు తనకు కొండంత బలాన్ని ఇచ్చాయన్నాడు. ఇక వన్డే కెప్టెన్ రోహిత్ శర్మలాగానే సూర్యకుమార్ యాదవ్ కూడా వ్యూహాత్మకంగా ఉంటాడన్నారు. అతడు బౌలర్ల పై ఎలాంటి ఒత్తిడి పెట్టడని చెప్పుకొచ్చాడు.