Vijay Hazare Trophy
vijay hazare trophy : దేశవాలీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రికార్డుల మోత మోగుతోంది. యువ బ్యాటర్లు బ్యాటుతో ఊచకోత కోస్తున్నారు. ఫోర్లు, సిక్సర్లతో బౌండరీల మోత మోగిస్తున్నారు. బుధవారం అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బిహార్ బ్యాటర్లు రెచ్చిపోయారు. బ్యాటుతో విధ్వంసం సృష్టించారు. తొలుత వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లోనే సెంచరీ చేయగా.. అదే మ్యాచ్ లో మరో యువ బ్యాటర్ 32 బంతుల్లోనే శతకం బాదేశాడు. ఫలితంగా బీహార్ జట్టు ఏకంగా 574 పరుగులు చేసింది. ఈ ఫీట్ అందుకున్న తొలి జట్టులో చరిత్ర సృష్టించింది.
విజయ్ హజారే ట్రోఫీలో బిహార్ జట్టు సరికొత్త రికార్డు నమోదు చేసింది. లిస్ట్ -ఎ క్రికెట్లో (వన్డే) అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది. బుధవారం అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో బిహార్ బ్యాటర్లు బ్యాటుతో విధ్వంసం సృష్టించారు. ఓపెనర్లలో మంగళ్ మహ్‌రౌర్ (33) పరుగులు చేయగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తంగా 84 బంతుల్లో 190 పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, 15 సిక్సులు ఉండటం విశేషం.
వన్‌డౌన్లో వచ్చిన పీయూశ్ సింగ్ సైతం అర్ధ శతకం (77)తో చెలరేగగా.. నాల్గో స్థానంలో ఆడిన వికెట్ కీపర్ బ్యాటర్ ఆయుశ్ లొహరుకా కేవలం 56 బంతుల్లో 116 పరుగులతో అదరగొట్టాడు. ఇక ఐదో బ్యాటర్ గా క్రీజులోకి వచ్చి బిహార్ జట్టు కెప్టెన్ సకీబుల్ గని ఊరమాస్ బ్యాటింగ్ తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 32 బంతుల్లోనేసెంచరీ చేసి.. వైభవ్ సూర్యకుమార్ రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తంగా 40 బంతుల్లోనే 128 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు ఆఫ్ సెంచరీలు, సెంచరీలు చేయడంతో బీహార్ స్కోర్ 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి ఏకంగా 574 పరుగులు చేసింది.
లిస్ట్ -ఎ క్రికెట్లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోర్. అంతకుముందు 2022లో అరుణాచల్ ప్రదేశ్ జట్టుపై తమిళనాడు జట్టు రెండు వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది. ప్రస్తుతం బిహార్ జట్టు ఆ రికార్డును అదిగమించి అదే అరుణాచల్ జట్టుపై 574 పరుగులు చేసింది.
🚨 BIHAR POSTED 574/6 IN THE VIJAY HAZARE TROPHY. 🚨
– Suryavanshi – 190 (84).
– Gani – 128* (40).
– Loharuka – 116 (56).THE HIGHEST EVER LIST A TOTAL IN HISTORY. 🤯 pic.twitter.com/cQrfD8jFBt
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 24, 2025
లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు
బిహార్- అరుణాచల్ ప్రదేశ్ మీద 2025లో 574/6
తమిళనాడు- అరుణాచల్ ప్రదేశ్ మీద 2022లో 506/2
ఇంగ్లండ్- నెదర్లాండ్స్ మీద 2022లో 498/4
సర్రే- గ్లౌసెస్టర్‌షైర్ మీద 2007లో 496/4
ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మీద 2018లో 481/6.