Vijay Hazare Trophy Punjab win by 1 run against Mumbai
Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీలో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బ్యాటర్లు పరుగుల పండగ చేసుకుంటున్నారు. ఇక పంజాబ్, ముంబై జట్ల మధ్య గురువారం (జనవరి 9) జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను ముంబై చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 45.1 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ బ్యాటర్లలో రమణ్‌దీప్ సింగ్ (72; 74 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అన్మోల్‌ప్రీత్ సింగ్ (57; 75 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. కెప్టెన్ అభిషేక్ శర్మ (8), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11) లు ఘోరంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు. ఓంకార్ తుకారాం తర్మలే, శివం దూబే, శశాంక్ అత్తార్డే లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. సాయి రాజ్ పాటిల్ ఓ వికెట్ సాధించాడు.
ఆ తరువాత 217 పరుగుల లక్ష్యంతో ముంబై బరిలోకి దిగింది. సర్ఫరాజ్ ఖాన్ (62; 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (45; 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఓ దశలో ముంబై 17.2 ఓవర్లకు 169/3 స్కోరుతో నిలిచింది.
అయితే.. ఆ తరువాత పంజాబ్ బౌలర్లు విజృంభించగా ముంబై బ్యాటర్లు అనూహ్యంగా తడబడ్డారు. చివరికి ముంబై 26.2 ఓవర్లలో 215 పరుగులకే పరిమితమైంది. దీంతో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (15), శివమ్ దూబె (12), హార్దిక్ తమోర్ (15) విఫలం అయ్యారు. పంజాబ్ బౌలర్లలో మయాంక్ మార్కండే, గూర్నూర్ బ్రార్ లు చెరో నాలుగు వికెట్లు తీశారు.