KKR vs RCB : రింకూ సింగ్ డ్యాన్స్ చూసి.. ప‌డి ప‌డి న‌వ్విన కోహ్లీ.. ప‌క్క‌కు తిరిగి మ‌రీ.. వీడియో వైర‌ల్‌

రింకూ సింగ్‌తో సైతం షారుఖ్ ఖాన్ డ్యాన్స్ చేయించాడు.

Courtesy BCCI

ఐపీఎల్ 2025 సీజ‌న్ ప్రారంభ‌మైంది. శ‌నివారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ పై రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు ఏడు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ 18వ సీజ‌న్ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. బాలీవుడ్ స్టార్ హీరో, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ స‌హ య‌జ‌మాని షారుఖ్ ఖాన్‌, సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌, బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా ప‌టానీ త‌దిత‌రులు త‌మ‌దైన శైలిలో అభిమానుల‌ను అల‌రించారు.

ముఖ్యంగా షారుఖ్ ఖాన్‌.. క్రికెట‌ర్ల‌తో డ్యాన్స్‌లు చేయించాడు. స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీతో షారుఖ్ ఖాన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

ఇక రింకూ సింగ్‌తో సైతం షారుఖ్ ఖాన్ డ్యాన్స్ చేయించాడు. అదే స‌మ‌యంలో స్టేజీపైనే కోహ్లీ ఉన్నాడు. డంకీ మూవీలోని లుట్ పుట్ గ‌యా అనే పాట‌కు రింకూ సింగ్ వేసిన స్టెప్పుల‌ను చూసి కోహ్లీకి న‌వ్వు ఆగ‌లేదు. ప‌క్క‌కు తిరిగి మ‌రీ న‌వ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 174 ప‌రుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా ర‌హానే (56; 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), సునీల్ న‌రైన్ (44; 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)లు రాణించారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్ రెండు వికెట్లు, యష్ దయాల్, రసిఖ్ సలామ్, సుయాష్ శర్మ త‌లా ఓ వికెట్ తీశారు.

అనంత‌రం 175 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్‌సీబీ 16.2 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఆర్‌సీబీ బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ (59 నాటౌట్; 36బంతుల్లో 4ఫోర్లు, 3సిక్స‌ర్లు), సాల్ట్ (56; 31బంతుల్లో 9ఫోర్లు, 2సిక్స‌ర్లు) ల‌తో పాటు కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ (34; 16 బంతులు ) మెరుపులు మెరిపించారు.