Virat Kohli comments after winning the match against Pakistan in Champions Trophy 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగిన విరాట్ కోహ్లీ (100 నాటౌట్; 111 బంతుల్లో 7 ఫోర్లు) ఒంటి చేత్తో భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. కోహ్లీ విజృంభణ కారణంగా 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వరుసగా రెండు విజయాలతో భారత్ దాదాపుగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇక పాక్ టోర్నీ నుంచి నిష్ర్కమించినట్లే. సాంకేతికంగా మాత్రమే ఇంకా ఆ జట్టు రేసులో ఉంది.
శతకంతో చెలరేగిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా కోహ్లీ తన ఇన్నింగ్స్ పై స్పందించాడు. మిడిల్ ఓవర్లలలో ఎలాంటి రిస్క్ లేకుండా స్పిన్నర్లను ఎదుర్కొనడమే తన పని అని చెప్పుకొచ్చాడు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లు చాలా చక్కగా ఆడారని కొనియాడాడు. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ ఔటైనా సరే వెంటనే వచ్చి రాణించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నాడు.
గత మ్యాచ్‌లో ఏం నేర్చుకున్నామో అర్థం చేసుకోవాలి. ఈ మ్యాచ్ తనకు సాధారణ వన్డే గేమ్ ఆడేందుకు అనుమతించిందన్నాడు. ఆఖర్లో శ్రేయస్ అయ్యర్ ధాటిగా ఆడాడని, తాను కొన్ని బౌండరీలు సాధించినట్లు తెలిపాడు. బయట తన గురించి ఏమనుకుంటారో అనే విషయాన్ని తాను పట్టించుకోనని కోహ్లీ చెప్పాడు. తన ఆటపై తనకు పూర్తి అవగాహన ఉందన్నాడు. మైదానంలో ప్రతి బంతికి 100 శాతం కష్టపడి ఆడతానని, ఈ రోజు దేవుడు దయతలిచి శతకం రూపంలో రివార్డు ఇచ్చాడన్నారు.
అందుకే అతడు నంబర్ వన్..
పాక్ పేసర్ షాహిన్ అఫ్రిది బౌలింగ్‌ను ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చాలా చక్కగా ఆడాడని, అందుకే అతడు వన్డేల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడని కోహ్లీ మెచ్చుకున్నాడు. లక్ష్య ఛేదనలో పవర్ ప్లేలో 60 నుంచి 70 పరుగులు చేయాల్సిన అవసరం ఉంటుందన్నాడు. ఇక నంబర్ 4లో వస్తున్న శ్రేయస్ అయ్యర్ చక్కగా ఆడుతున్నాడు. భారత్‌లో ఆడినట్లుగానే చెలరేగి ఆడాడు. తదుపరి మ్యాచ్‌కు వారం రోజుల సమయం దొరకడం చాలా మంచిది. వాస్తవం చెప్పాలంటే 36 వయసులో ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడాలంటే తగినంత విశ్రాంతి కావాలని కోహ్లీ అన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజీలో భారత్ తన చివరి మ్యాచ్‌ను మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది.