Virat Kohli gift to Merwe
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో ఓటమే ఎగురని జట్టుగా సెమీ ఫైనల్‌కు దూసుకుపోయింది. ఆదివారం లీగ్ స్టేజీలో ఆఖరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికైంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 160 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విరాట్ కోహ్లీ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. తాను సంతకం చేసిన తన జెర్సీని నెదర్లాండ్స్ ఆటగాడు వాన్ డెర్ మెర్వ్కు బహుమతిగా ఇచ్చాడు. అనంతరం అతడిని కౌగిలించుకున్నాడు. కాగా.. కోహ్లీ నుంచి గిఫ్ట్ అందుకున్న మెర్వ్ ఎంతో హ్యాపీగా పీల్ అయ్యాడు. ఈ సందర్భంగా కోహ్లీకి ధన్యవాదాలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Kuldeep Yadav : న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్.. కుల్దీప్ యాదప్ కీలక వ్యాఖ్యలు
కాగా.. వాన్డెర్మెర్వ్ గతంలో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ జట్టులో అవకాశాలు రాకపోవడంతో నెదర్లాండ్స్‌కు వెళ్లి ఆ దేశం తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2009, 2010 ఐపీఎల్ సీజన్లలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున మెర్వ్ ఆడాడు. అప్పటి నుంచి కోహ్లీ, మెర్వ్‌ల మధ్య స్నేహబంధం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసింది మెర్వ్ కావడం గమనార్హం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్; 94 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (102; 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలు బాదారు. రోహిత్ శర్మ (61; 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (51; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) లతో విరాట్ కోహ్లీ (51; 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) లు హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 160 పరుగుల తేడాతో విజయం సాధించింది.