Team of the tournament : రోహిత్‌కు షాక్‌.. కెప్టెన్‌గా కోహ్లీ.. క్రికెట్ ఆస్ట్రేలియా ‘టీమ్ ఆఫ్ ది టోర్న‌మెంట్’..

Cricket Australia Team of the tournament : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో లీగ్ ద‌శ ముగియ‌డంతో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన ప్లేయ‌ర్లలోంచి 12 మందిని క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ ఆఫ్ ది టోర్న‌మెంట్ పేరిట ఎంపిక చేసింది.

Rohit- Kohli

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో లీగ్ ద‌శ ముగిసింది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో విజ‌యం సాధించి టీమ్ ఇండియా ఓట‌మే ఎగుర‌ని జ‌ట్టుగా సెమీ ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. భార‌త్ తో పాటు ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జ‌ట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. 10 జ‌ట్లు పోటీ ప‌డ‌గా ప్ర‌స్తుతం నాలుగు జ‌ట్లు బ‌రిలో నిలిచాయి. బ్యాట‌ర్లు ప‌రుగుల వ‌ర‌ద పారించ‌గా, బౌల‌ర్లు వికెట్ల పంట పండించుకున్నారు. లీగ్ ద‌శ ముగియ‌డంతో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన ప్లేయ‌ర్ల‌లోంచి 12 మందిని క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ ఆఫ్ ది టోర్న‌మెంట్ పేరిట ఎంపిక చేసింది.

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని ఈ జ‌ట్టుకు కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. స్టార్ ఆట‌గాడు, భార‌త సార‌థి రోహిత్ శ‌ర్మ‌కు క‌నీసం ఈ జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. టీమ్ఇండియా నుంచి కోహ్లీతో పాటు బుమ్రా, ర‌వీంద్ర జ‌డేజా, ష‌మీ ల‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జ‌ట్టులో చోటు ద‌క్కింది

క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన టోర్నమెంట్ జ‌ట్టులోని ప్లేయ‌ర్లు వీరే..

క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా) : ఈ మెగాటోర్నీలో 9 మ్యాచులు ఆడిన డికాక్ 65.67 స‌గ‌టుతో 591 ప‌రుగులు చేశాడు. నాలుగు శ‌త‌కాలు బాదాడు. అత్యధిక స్కోరు 174.

డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) : డేవిడ్ వార్న‌ర్ 9 మ్యాచ్‌ల్లో 55.44 సగటుతో 105.5 స్ట్రైక్ రేట్‌తో 499 పరుగులు చేశాడు. రెండు శ‌త‌కాలు, రెండు అర్ధ‌శ‌త‌కాలు సాధించాడు. అత్య‌ధిక స్కోరు 163.

రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్) : ఈ కివీస్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ 9 మ్యాచుల్లో 70.63 స్ట్రైక్ రేట్‌తో 565 పరుగులు చేశాడు. మూడు సెంచ‌రీలు, రెండు అర్ధ‌శ‌త‌కాలు ఇందులో ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 123 నాటౌట్. బౌలింగ్‌లో 5.68 ఎకానమీ రేటుతో 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Also Read : కేఎల్ రాహుల్ పై పాక్ మాజీ కెప్టెన్లు అక్రమ్, మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు

విరాట్ కోహ్లీ (భార‌త్) : భార‌త స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ 99.00 సగటుతో 88.50 స్ట్రైక్ రేట్‌తో 594 పరుగులు చేశాడు. రెండు శ‌త‌కాలు, 5 అర్ధ‌సెంచ‌రీలు బాదాడు. అత్య‌ధిక స్కోరు 103 నాటౌట్.

ఐడెన్ మార్క్రామ్ (దక్షిణాఫ్రికా) : మార్క్రామ్ 49.50 సగటుతో 396 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, మూడు అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్యుత్త‌మ స్కోరు 106.

గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) : ఈ మెగాటోర్నీలో మాక్స్‌వెల్ కొన్ని అత్య‌ద్భుత‌మైన ఇన్నింగ్స్‌ల‌ను ఆడాడు. చ‌రిత్ర‌లో త‌న కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని లిఖించుకున్నాడు. 7 మ్యాచ్‌ల్లో 152.7 స్ట్రైక్ రేట్‌తో 397 పరుగులు చేశాడు. రెండు సెంచ‌రీలు బాదాడు. అత్య‌ధిక స్కోరు 201 నాటౌట్. అంతేకాదు బౌలింగ్‌లో 4.95 ఎకానమీతో 5 వికెట్లు సాధించాడు.

మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా) : ఈ ద‌క్షిణాఫ్రికా ఆల్ రౌండ‌ర్‌ 8 మ్యాచ్‌ల్లో 111.3 స్ట్రైక్‌రేట్‌తో 157 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ‌శ‌త‌కం ఉంది. బౌలింగ్‌లో 6.40 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు.

రవీంద్ర జడేజా (భార‌త్‌) : ఈ భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ 9 మ్యాచ్‌ల్లో 115.6 స్ట్రైక్ రేట్‌తో 111 పరుగులు చేశాడు. 3.96 ఎకానమీతో 16 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

మహ్మద్ షమీ (భార‌త్‌) : ఈ మెగా టోర్నీలో ఆరంభంలో నాలుగు మ్యాచుల‌కు ష‌మీకి జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ ఈ ప్రపంచకప్‌లో 4.78 ఎకానమీతో 16 వికెట్లు పడగొట్టాడు. రెండు సార్లు 5 వికెట్ల ప్ర‌ద‌ర్శ‌నను న‌మోదు చేశాడు.

ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) : ఈ ఆసీస్ స్పిన్నర్ 9 మ్యాచ్‌ల్లో 5.27 ఎకాన‌మీ 22 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Also Read వన్డే ప్రపంచకప్.. టాప్ 5 బ్యాటర్లు, బౌలర్లు వీరే.. అశ్విన్ ఆడింది ఒక్క మ్యాచ్.. కానీ

జస్ప్రీత్ బుమ్రా (భార‌త్‌) : భార‌త పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా 3.65 ఎకాన‌మీతో 17 వికెట్లు తీశాడు.

దిల్షాన్ మధుశంక (శ్రీలంక) : దిల్షాన్ 9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు 6.70గా ఉంది,

టోర్నమెంట్ జట్టు ఇదే : క్వింటన్ డికాక్ (వికెట్ కీప‌ర్‌), డేవిడ్ వార్నర్, రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), ఐడెన్ మార్క్రామ్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో జాన్సెన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా, జ‌స్ ప్రీత్ బుమ్రా, 12వ ఆట‌గాడిగా దిల్షాన్ మధుశంక.