Virat Kohli Posts Cryptic Message On Social Media Ahead Of ODI retirement rumours
Virat Kohli : టీ20లు, టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తరువాత ఆసీస్‌తో సిరీస్‌తోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. భారత్, ఆసీస్ జట్ల మధ్య అక్టోబర్ 19 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత జట్టుతో కలిసి బుధవారం ఆస్ట్రేలియా విమానం ఎక్కాడు.
ఈ సిరీస్ ఎంతో కీలకం అని, ఇందులో విఫలం అయితే వన్డే ప్రపంచకప్ 2027 ఆడాలనే కోహ్లీ లక్ష్యం నెరవేరడం చాలా కష్టం అని రవిశాస్త్రి లాంటి మాజీ క్రికెటర్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. మనం ఎప్పుడైతే చేతులు ఎత్తేస్తామో అప్పుడు మాత్రమే మనకు ఓటమి వస్తుంది అని అర్థం వచ్చేలా కోహ్లీ రాసుకొచ్చాడు. కాగా.. కోహ్లీ చేసిన పోస్టు పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
క్లారిటీ ఇవ్వని గంభీర్..
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనే లక్ష్యంతో ఉన్నారు. అయితే.. ఈ టోర్నీలో వారు ఖచ్చితంగా ఆడతారనే గ్యారంటీ మాత్రం రావడం లేదు. వీరిద్దరి భవిష్యత్తు పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా స్పష్టత ఇవ్వడం లేదు.
The only time you truly fail, is when you decide to give up.
— Virat Kohli (@imVkohli) October 16, 2025
ప్రపంచకప్ కు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందని, వర్తమానంలో ఉండడం ముఖ్యమని గంభీర్ చెప్పాడు. ఆ ఇద్దరు ఎంతో నాణ్యమైన ప్లేయర్లు అని, ఆస్ట్రేలియా పర్యటనలో వారి అనుభవం జట్టుకు ఎంతో అవసరం అని అన్నాడు. ఆసీస్ పర్యటనలో వారు రాణిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.