Rohit Sharma : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. రోహిత్ శర్మను ఊరిస్తున్న 8 భారీ రికార్డులు.. 50 శతకాలు, 500 మ్యాచ్‌లు ఇంకా..
ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) 8 రికార్డులను అందుకునే అవకాశం ఉంది.

Rohit Sharma can shatter 8 Records during Australia tour 2025
Rohit Sharma : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆదివారం (అక్టోబర్ 19) నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ కు ముందు టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మను ఒకటి కాదు రెండు కాదు నాలుగు కాదు ఏకంగా 8 రికార్డులు ఊరిస్తున్నాయి.
మరి ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) అందుకునే అవకాశం ఉన్న ఆ రికార్డులు ఏంటో ఓ సారి చూద్దాం..
* 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు..
రోహిత్ శర్మ 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 67 టెస్టులు, 273 వన్డేలు, 159 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి టీమ్ఇండియా తరుపున హిట్‌మ్యాన్ 499 మ్యాచ్‌లు ఆడాడు.
ఆదివారం పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డే మ్యాచ్ రోహిత్ కెరీర్‌లో నిలిచిపోనుంది. ఈ మ్యాచ్ అంతర్జాతీయ క్రికెట్‌లో హిట్‌మ్యాన్‌కు 500వ మ్యాచ్ కావడం విశేషం.
* 50 అంతర్జాతీయ సెంచరీలు..
హిట్‌మ్యాన్ 67 టెస్టుల్లో 12 శతకాలు, 273 వన్డేల్లో 32 సెంచరీలు, 159 టీ20 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు చేశాడు. మొత్తంగా 499 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 49 సెంచరీలు చేశాడు. ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క సెంచరీ చేసినా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీల మైలురాయిని చేరుకుంటాడు.
* వన్డేల్లో అత్యధిక సిక్సర్లు..
రోహిత్ శర్మ ఇప్పటి వరకు 273 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 265 ఇన్నింగ్స్‌ల్లో 344 సిక్సర్లు బాదాడు. ఆసీస్‌తో సిరీస్‌లో మరో 8 సిక్సర్లు కొడితే.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు కొట్టాడు.
* మరో 30 పరుగులు చేస్తే..
రోహిత్ శర్మ తనదైన శైలిలో రాణిస్తూ భారత్‌కు ఎన్నో మ్యాచ్‌ల్లో విజయాలను అందించాడు. కాగా.. భారత్ గెలిచిన వన్డే మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 7970 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రాబోయే ఆసీస్ సిరీస్‌లో భారత్ గెలిచే మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 30 పరుగులు చేస్తే 8వేల మైలురాయిని చేరుకుంటాడు.
*ఆస్ట్రేలియాలో ఆసీస్‌పై వన్డేల్లో 1000 పరుగులు..
రోహిత్ శర్మ తొలిసారి ఆసీస్ గడ్డ పై 2008లో ఆసీస్ పై తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాతో 18 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 990 పరుగులు సాధించాడు. ఇప్పుడు మరో 10 పరుగులు సాధిస్తే ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌ల్లో 1000 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టిస్తాడు.
*ఓపెనర్‌గా అత్యధిక పరుగులు..
టీమ్ఇండియా ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 321 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 15758 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. 348 మ్యాచ్‌ల్లో 15584 పరుగులు సాధించాడు. ఆసీస్‌తో సిరీస్‌లో ఓపెనర్‌గా రోహిత్ మరో 174 పరుగులు సాధిస్తే.. అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా రికార్డులకు ఎక్కుతాడు.
* ఆసీస్ 10 సెంచరీలు..
అంతర్జాతీయ క్రికెట్‌లో 2007లో అడుగుపెట్టినప్పటి నుంచి రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో కలిపి ఆసీస్ పై 84 మ్యాచ్‌లు ఆడాడు. 9 సెంచరీలు చేశాడు. ఈ సిరీస్‌లో ఒక సెంచరీ చేస్తే.. ఆసీస్ పై 10 శతకాలు బాదిన ఏకైక భారత ఓపెనర్‌గా హిట్‌మ్యాన్ నిలుస్తాడు.
* గంగూలీ రికార్డు బ్రేక్..
2007లో వన్డేల్లో అరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ ఇప్పటి వరకు 273 మ్యాచ్‌లు ఆడాడు. 265 ఇన్నింగ్స్‌ల్లో 48.8 సగటుతో 11,168 పరుగులు సాధించాడు. వన్డేల్లో మరో 54 పరుగులు చేస్తే.. టీమ్ఇండియా తరుపున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి హిట్‌మ్యాన్ చేరుకుంటాడు. ఈ క్రమంలో అతడు సౌరవ్ గంగూలీని (11,221)ని అధిగమిస్తాడు.