మరో రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఇంతవరకు ఏ భారత క్రికెటర్‌కూ సాధ్యం కాలేదు..

డేవిడ్ వార్నర్‌, కోహ్లీ తర్వాతి స్థానాల్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్ ఉన్నారు.

Pic: @IPL (X)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జైపూర్‌లో జరిగిన మ్యాచులో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ బాదాడు. దీంతో తన క్రికెట్‌ కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. అతడికిది టీ20ల్లో 100వ హాఫ్ సెంచరీ. ఇంతకు ఏ భారత బ్యాటర్‌ కూడా 100 హాఫ్ సెంచరీలు చేయలేదు.

డేవిడ్‌ వార్నర్ 400 మ్యాచుల్లో 399 ఇన్నింగ్స్‌లో 108 హాఫ్ సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ 405 మ్యాచుల్లో 388 ఇన్నింగ్స్‌లో 100 హాఫ్‌ సెంచరీలు చేశాడు. బాబర్ ఆజాం 311 మ్యాచుల్లో 300 ఇన్నింగ్స్‌లో 90 హాఫ్‌ సెంచరీలు బాదాడు. గేల్ 463 మ్యాచుల్లో 455 ఇన్నింగ్స్‌లో 88 అర్ధ సెంచరీలు చేశాడు. జేసీ బట్లర్ 440 మ్యాచుల్లో 415 ఇన్నింగ్స్‌లో 86 హాఫ్ సెంచరీలు బాదాడు.

ఐపీఎల్‌ రికార్డుల విషయానికి వస్తే.. ఈ హాఫ్ సెంచరీతో కోహ్లీ ఇప్పుడు ఐపీఎల్‌లో అత్యధికంగా 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్‌తో కలిసి అగ్రస్థానంలో ఉన్నాడు. డేవిడ్‌ వార్నర్ 184 ఇన్నింగ్స్‌లో 66 సార్లు 50+ స్కోర్ చేయగా, విరాట్ కోహ్లీ 250 ఇన్నింగ్స్‌లో 66 సార్లు 50+ స్కోర్ చేశాడు.

Also Read: ధనాధనా హాఫ్ సెంచరీలు బాదిన ఓపెనర్లు కోహ్లీ, ఫిలిప్ సాల్ట్.. ఆర్సీబీ ఘనవిజయం

ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్‌, కోహ్లీ తర్వాతి స్థానాల్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్ ఉన్నారు. శిఖర్ ధావన్ 221 ఇన్నింగ్స్‌లో 53 హాఫ్ సెంచరీలు, రోహిత్ శర్మ 257 ఇన్నింగ్స్‌లో 45 హాఫ్ సెంచరీలు, కేఎల్ రాహుల్ 126 ఇన్నింగ్స్‌లో 43 హాఫ్‌ సెంచరీలు బాదారు.

ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆర్సీబీ బ్యాటర్లు ఫిలిప్ సాల్ట్ కూడా హాఫ్ సెంచరీ బాదారు. ఆర్సీబీ ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో మొత్తం ఆరు మ్యాచులు ఆడి నాలుగు గెలుపొంది, రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

ఇదే మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (75) కూడా హాఫ్ సెంచరీ బాదాడు. ఆ జట్టు ఇచ్చిన 174 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ సునాయాసంగా ఛేదించింది.