WCL 2025 : దంచికొట్టిన ధావ‌న్.. రాయుడు డ‌కౌట్‌, యువీ విఫ‌లం.. వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లో ఓడిన భార‌త్‌..

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజ‌న్‌లో ఇండియా ఛాంపియ‌న్స్ వ‌రుస‌గా రెండో ఓట‌మిని చ‌విచూసింది.

WCL 2025 Australia Champions won by 4 wickets against India Champions

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజ‌న్‌లో ఇండియా ఛాంపియ‌న్స్ వ‌రుస‌గా రెండో ఓట‌మిని చ‌విచూసింది. యూవీ సార‌థ్యంలో భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియా ఛాంపియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైంది.

ఈ మ్యాచ్‌లో ఇండియా ఛాంపియ‌న్స్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. శిఖ‌ర్ ధావ‌న్ (91నాటౌట్‌; 60 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌), యూస‌ఫ్ ఫ‌ఠాన్ (52 నాటౌట్; 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర హాఫ్ సెంచ‌రీలు చేశారు. రాబిన్ ఉత‌ప్ప (37; 21బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది.

Asia Cup: ఆసియా కప్ -2025 పూర్తి షెడ్యూల్ ఇదే.. భారత్ వర్సెస్ పాక్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు..! ఇతర మ్యాచ్‌ల తేదీలు, వేదికలు.. ఫుల్ డీటెయిల్స్..

మిగిలిన వారిలో అంబ‌టి రాయుడు డ‌కౌట్ కాగా, సురైశ్ రైనా (11), కెప్టెన్ యువ‌రాజ్ సింగ్ (3) లు ఘోరంగా విఫ‌లం అయ్యారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో డేనియల్ క్రిస్టియన్ రెండు వికెట్లు తీయ‌గా, బ్రెట్ లీ, డి ఆర్సీ షార్ట్ చెరో వికెట్ సాధించారు.

ఆత‌రువాత కల్లమ్ ఫెర్గూసన్ (70 నాటౌట్; 38 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) మెరుపు హాప్ సెంచ‌రీ చేయ‌గా, డేనియ‌ల్ క్రిస్టియ‌న్(39), క్రిస్ లిన్ (25) లు త‌లా ఓ చేయి వేయ‌డంతో 204 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఆసీస్ 19.5 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. భార‌త బౌల‌ర్ల‌లో పీయూష్ చావ్లా మూడు వికెట్లు తీశాడు. హ‌ర్భ‌జ‌న్ సింగ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టగా, విన‌య్ కుమార్ ఓ వికెట్ తీశాడు.

Hardik Pandya : బ్యాట్ సెల‌క్ష‌న్‌లో హార్దిక్‌కు సాయం చేస్తున్న ఈ బుడ్డోడు ఎవ‌రో తెలుసా?

ఈ సీజ‌న్‌లో ఆసీస్‌కు ఇది రెండో విజ‌యం. ఓ మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో ఆ జ‌ట్టు ఖాతాలో 5 పాయింట్లు ఉండ‌గా పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో ఉంది. ఇక ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భార‌త్ ఇంత వ‌ర‌కు పాయింట్ల ఖాతా తెర‌వ‌లేదు. ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో ఉంది.