RR vs RCB: స్మిత్ చిన్న పొరపాటు నిర్ణయం.. రాజస్థాన్ ఓటమికి కారణం అదేనా?

  • Publish Date - October 18, 2020 / 01:24 AM IST

ఉత్కంఠగా సాగిన రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో చివరకు విజయం బెంగళూరు కైవసం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో చివరి వరకు రాజస్థాన్ పోరాడింది. కానీ కెప్టెన్ స్మిత్ పొరపాటు నిర్ణయం రాజస్థాన్ ఓటమికి కారణం అయ్యింది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక వేల జోఫ్రా ఆర్చర్‌ను చివరి ఓవర్‌లో ఉంచే వ్యూహం కాకుండా కొంచెం వ్యూహం మార్చుకుని ఉంటే రాజస్థాన్ రాయల్స్‌కు విజయం దక్కి ఉండేదని అంటున్నారు.



బెంగళూరుతో మ్యాచ్‌లో చివరి రెండు ఓవర్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవడానికి 35 పరుగులు అవసరం అయినప్పుడు 19వ ఓవర్లో ఎబి డివిలియర్స్‌పై బౌలింగ్ చేయడానికి స్టీవెన్ స్మిత్‌కు ఇద్దరు బౌలర్లు అవకాశం ఉంది. జోఫ్రా ఆర్చర్.. మరొకరు జయదేవ్ ఉనద్కత్. అయితే ముందుగా 19 వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి జయదేవ్ ఉనద్కత్‌ను స్మిత్ పంపించాడు. 3 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చిన ఉనద్కత్‌ ఆ ఓవర్‌లో 25పరుగులు ఇచ్చాడు. ఇదే ఈ మ్యాచ్‌లో కీలక మలుపు.



వాస్తవానికి టీ20 క్రికెట్‌లో పరుగులను డిఫెండింగ్ చేసేటప్పుడు, 19వ ఓవర్‌లో జట్టు నంబర్ వన్ బౌలర్‌కు బౌలింగ్ చేసే అవకాశం ఇస్తారు. ఉత్తమ బౌలర్‌ను 19 వ ఓవర్‌లో పంపిస్తే.. చివరి ఓవర్‌కు చెయ్యవలసిన పరుగులు పెరిగి ఒత్తిడిలో గెలిచే అవకాశం తక్కువ అవుతుంది. చివరి ఓవర్‌లో ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నించాలంటే ఎవరికైనా కష్టం అవుతుంది. అందుకే అటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ స్మిత్ మాత్రం.. పెద్దగా ఈ సీజన్‌లోనే రాణించని ఉనద్కత్‌పై అటువంటి పెద్ద బాధ్యతను పెట్టారు.



దీంతో ఉనద్కత్ వేసిన బౌలింగ్‌లో డివిలియర్స్ మొదటి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టాడు. అక్కడి నుంచి మ్యాచ్ పూర్తిగా బెంగళూరు వైపు మళ్లింది. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లకు వ్యతిరేకంగా డెత్ ఓవర్స్‌లో డివిలియర్స్ రికార్డు చాలా బాగుంది. అదే సమయంలో జోఫ్రా ఆర్చర్ కాని 19వ ఓవర్ వేసి ఉంటే కనీసం 15పరుగుల లోపే కట్టడి చేసేవాడు. క్రీజులో ఉన్న గుర్‌కిరాత్ సింగ్ చేత ఫోర్ కొట్టించేవాడు కూడా కాదు.. దాంతో చివరి ఓవర్‌లో కనీసం 20పరుగులు టార్గెట్ ఉంటే బెంగళూరు గెలవాలంటే కచ్చితంగా కష్టపడేది.



మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో బౌలింగ్ చేసే అవకాశం ఆర్చర్‌కు లభించినప్పుడు, అతని చేతిలో రక్షించడానికి కేవలం 10 పరుగులు మాత్రమే ఉన్నాయి. అది సాధ్యం కూడా కాదు.. టీ20 క్రికెట్‌లో 10పరుగులు చివరి ఓవర్‌లో కొట్టడం అంటే 100 శాతం కొట్టేస్తారు.. ఆ విధంగా స్మిత్ తీసుకున్న చిన్న పొరపాటు నిర్ణయం రాజస్థాన్ ప్లే ఆశలను ఆవిరి చేసింది.

ట్రెండింగ్ వార్తలు