Glenn Maxwell : మాక్స్‌వెల్ కు బై-ర‌న్న‌ర్‌ను ఎందుకు అనుమతించ‌లేదు..? అలాగే ఎందుకు బ్యాటింగ్ చేయాల్సి వ‌చ్చింది..?

Glenn Maxwell Not Permitted A Runner : క్రికెట్‌లో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా మాక్స్‌వెల్ పేరే మారుమోగిపోతుంది. మంగ‌ళ‌వారం ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా అఫ్గానిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మాక్స్‌వెల్ అసాధార‌ణ ఇన్నింగ్స్ ఆడ‌డ‌మే అందుకు కార‌ణం.

Glenn Maxwell Not Permitted A Runner

క్రికెట్‌లో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా మాక్స్‌వెల్ పేరే మారుమోగిపోతుంది. మంగ‌ళ‌వారం ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా అఫ్గానిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మాక్స్‌వెల్ అసాధార‌ణ ఇన్నింగ్స్ ఆడ‌డ‌మే అందుకు కార‌ణం. మిగ‌తా బ్యాట‌ర్లంతా పెవిలియ‌న్‌కు చేరుకున్నా కూడా ఒంటరి పోరాటం చేశాడు. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్స‌ర్ల‌తో 201 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచి జ‌ట్టుకు అద్వితీయ‌మైన విజ‌యాన్ని అందించాడు. త‌న జ‌ట్టు సెమీస్ చేర‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా త‌రుపున ద్విశ‌త‌కం బాదిన మొద‌టి ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

మాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌లో వ్య‌క్తిగ‌త స్కోరు 150 ప‌రుగుల మైలురాయిని చేరుకునేంత వ‌ర‌కు సాఫీగానే సాగింది. ఆ త‌రువాత నుంచే మాక్స్‌వెల్‌కు ఇబ్బందులు ఎదుర‌య్యాయి. కండ‌రాలు ప‌ట్టేశాయి. దీంతో తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డాడు. ఫిజియో వ‌చ్చి ప‌లు మార్లు చికిత్స అందించాల్సి వ‌చ్చింది. పరిగెత్త‌డం మాట అటుంచితే కనీసం క్రీజ్‌లో సౌక‌ర్య‌వంతంగా కూడా నిల‌బ‌డ‌లేక‌పోయాడు. సింగిల్స్ వ‌ద్ద‌ని బౌండ‌రీల‌తో స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించారు. ఆఖ‌రి వ‌ర‌కు ప‌ట్టు వ‌ద‌ల‌కుండా ఆసీస్‌ను గెలిపించాడు.

బై ర‌న్న‌ర్‌ను ఎందుకు తీసుకోలేదు..?

ఈ క్ర‌మంలో ఇప్పుడు చాలా మందికి వ‌చ్చే అనుమానం ఏంటంటే..? అంత‌లా ఇబ్బంది ప‌డే బ‌దులు బైర‌న్న‌ర్‌ను పెట్టుకోవ‌చ్చు గ‌దా అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. గ‌తంలో అయితే ఇలాంటి సంద‌ర్భాల్లో బ్యాట‌ర్లు బైర‌న్న‌ర్ సాయం తీసుకుని బ్యాటింగ్ చేసేవాళ్లు. అయితే.. కొన్నాళ్ల నుంచి దీనిని తీసివేశారు. 2011 లో జ‌రిగిన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌మావేశంలో బై ర‌న్న‌ర్ సాయం తీసుకునే అవ‌కాశం లేకుండా చేశారు.

Also Read : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ ప్లేయర్స్ హవా.. అగ్రస్థానంకు దూసుకెళ్లిన శుభ్‌మన్ గిల్, సిరాజ్

బైర‌న్న‌ర్ వ‌ల్ల ఫీల్డింగ్ చేసే జ‌ట్టుకు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల మేర‌కు ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఇటు దీనిపై నిబంధ‌న‌లు రూపొందించే మెరిబోన్ క్రికెట్ క్ల‌బ్(ఎంసీసీ) సైతం స్ప‌ష్ట‌త ఇచ్చింది. బ్యాటింగ్ విభాగంలోని చ‌ట్టాల్లో ఎలాంటి మార్పులు చేయ‌లేద‌ని తెలిపింది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లోని మ్యాచుల్లో ప‌రిస్థితుల‌కు అనుగుణంగానే ఈ స‌వ‌ర‌ణ చేసిన‌ట్లు తెలియ‌జేసింది. కాగా.. దేశ‌వాలీ, ఇత‌ర క్రికెట్ ఆట‌ల్లో మాత్రం య‌థావిధిగా బై ర‌న్న‌ర్‌ను పెట్టుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ స‌వ‌ర‌ణ కార‌ణంగానే మాక్స్‌వెల్‌కు కండ‌రాలు ప‌ట్టేసినా బై ర‌న్న‌ర్‌ను తీసుకునే అవ‌కాశం లేకుండా పోయింది. అందుక‌నే అత‌డు నొప్పితో బాధ‌ప‌డుతూనే బ్యాటింగ్ చేశాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 291 ప‌రుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (129 నాటౌట్; 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేశాడు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ఆసీస్ 91 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయిన పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డినా మాక్స్‌వెల్ విధ్వంస‌క‌ర ద్విశ‌త‌కంతో జ‌ట్టుకు ఒంటి చేత్తో విజ‌యాన్ని అందించాడు. మాక్స్‌వెల్ ఇన్నింగ్స్ కార‌ణంగా ల‌క్ష్యాన్ని ఆసీస్ 46.5 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Also Read : టైమ్డ్ ఔట్ అంటూ అప్పీల్ చేసిన బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్‌.. వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ష‌కీబ్ ఔట్‌..

ట్రెండింగ్ వార్తలు