ODI World Cup 2023 : టైమ్డ్ ఔట్ అంటూ అప్పీల్ చేసిన బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి షకీబ్ ఔట్..
Shakib Al Hasan Ruled Out ODI World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక పై విజయం సాధించి మంచి జోష్‌లో ఉన్న బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ తగిలింది.

Shakib Al Hasan Ruled Out ODI World Cup
Shakib Al Hasan: వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక పై విజయం సాధించి మంచి జోష్‌లో ఉన్న బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ప్రపంచకప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. గాయం కారణంగా అతడు ప్రపంచకప్ నుంచి నిష్క్రమించాడు. ఢిల్లీ వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా షకీబ్ ఎడమ చేతికి గాయమైంది. ఫిజియో వచ్చి నొప్పి నివారణ మందులు ఇవ్వడంతో బ్యాటింగ్ కంటిన్యూ చేశాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న షకీబ్ 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు.
మ్యాచ్ అనంతరం అతడి గాయం తీవ్రతను తెలుసుకునేందుకు స్కానింగ్ నిర్వహించారు. ఫ్రాక్చర్ అయినట్లు తెలిసింది. అతడు గాయం నుంచి కోలుకునేందుకు మూడు నుంచి నాలుగు వారాల పాటు సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో షకీబ్ బంగ్లాదేశ్‌కు తిరుగు ప్రయాణమైనట్లు ఫిజియో బైజెదుల్ ఇస్లాం ఖాన్ చెప్పారు.
Also Read: మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌లో ట్విస్ట్.. అబ్బే నాకేం తెలియదు.. అతడు చెబితేనే..: షకీబ్
కాగా.. ఈ ప్రపంచకప్‌లో సెమీస్ రేసు నుంచి బంగ్లాదేశ్ ఎప్పుడో నిష్క్రమించింది. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీలో స్థానం దక్కించుకునేందుకు పోరాడుతోంది. లీగ్ దశ ముగిసే సరికి ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో తొలి ఏడు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కి అర్హత సాధిస్తాయని ఐసీసీ ఇప్పటికే వెల్లడించింది. ప్రస్తుతం పట్టికలో బంగ్లాదేశ్ ఏడో స్థానంలో ఉంది. అయితే.. లీగ్ దశ ముగిసే సరికి అదే స్థానంలో బంగ్లాదేశ్ ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది.
ఇక శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. చరిత్ అసలంక (108; 105 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకంతో రాణించాడు. అనంతరం లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో (90; 101 బంతుల్లో 12 ఫోర్లు), షకీబ్ అల్ హసన్ (82; 65 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించారు. అయితే.. ఈ విజయంతో కంటే మాథ్యూస్ విషయంలో టైమ్డ్ ఔట్ అప్పీల్ కారణంగా బంగ్లాదేశ్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
Also Read : పాకిస్థాన్‌కు వర్షం సాయం చేస్తే.. ఐసీసీ షాకిచ్చింది