Angelo Mathews Timed Out : మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌లో ట్విస్ట్.. అబ్బే నాకేం తెలియదు.. అతడు చెబితేనే..: షకీబ్
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పై ప్రస్తుతం విమర్శల జడివాన కొనసాగుతోంది.

Shakib on Mathews Timed Out
Shakib Al Hasan-Angelo Mathews Timed Out : బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పై ప్రస్తుతం విమర్శల జడివాన కొనసాగుతోంది. సోమవారం ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అంటూ అప్పీల్ చేయడమే ఇందుకు కారణం. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. క్రికెట్ నిబంధనల ప్రకారం షకీబ్ చేసింది కరెక్టు కావొచ్చు కానీ ఇది క్రీడా స్పూర్తికి విరుద్దం అంటూ పలువురు క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మాథ్యూస్ పై అప్పీల్‌ను షకీబ్ వెనక్కి తీసుకొని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా.. టైమ్డ్ ఔట్ విషయం పై బంగ్లా కెప్టెన్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు.
తనకు ఈ నిబంధన పై అవగాహాన లేదని, ఓ యువగాడు చెప్పడంతోనే తాను అప్పీల్ చేసినట్లు వెల్లడించాడు. అయితే సదరు క్రికెటర్ ఎవరు అనే విషయాన్ని మాత్రం అతడు వెల్లడించలేదు. ‘మా ఫీల్డర్లలో ఒకరు నా వద్ద వచ్చి, ఇప్పుడు గనుక మీరు అప్పీల్ చేస్తే మాథ్యూస్ నిర్ణీత సమయంలోగా గార్డు తీసుకోని కారణంగా అంపైర్లు అతడిని ఔట్‌గా ప్రకటిస్తారు. నిబంధనల్లో ఇది ఉంది. అని అతడు నాతో చెప్పాడు. దీంతో నేను అంపైర్లకు అప్పీల్ చేశాను.’ అని షకీబ్ చెప్పాడు.
‘నువ్వు సీరియస్‌గానే అప్పీల్ చేస్తున్నా అని అంపైర్లు నన్ను అడిగారు. నేను అవునని చెప్పాను. ఆ సమయంలో అది తప్పో, ఒప్పో అనే సంగతి నాకు తెలియదు. నిబంధనల్లో ఉంది కాబట్టే అప్పీల్ చేశాను. మ్యాచ్ గెలిచేందుకు ఏ చేసేందుకైనా నేను సిద్ధం.’ అని షకీబ్ చెప్పుకొచ్చాడు.
కాగా.. సదరు క్రికెటర్ ఎవరో షకీబ్ చెప్పనప్పటికీ అతడు నజ్ముల్ హొస్సేన్ శాంటో అని వీడియో పుటేజీ స్పష్టం చేస్తోంది.