Womens ODI World Cup 2025 Harmanpreet Kaur surpasses Mithali Raj in major record
Harmanpreet Kaur : భారత మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన ఘనత సాధించింది. మహిళల క్రికెట్‌లో టీమ్ఇండియా తరుపున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రెండో ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కింది. ఈ క్రమంలో హర్మన్ (Harmanpreet Kaur) మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను అధిగమించింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సిద్రా అమీన్ క్యాచ్ అందుకోవడం ద్వారా హర్మన్ ఈ ఘనత సాధించింది.
232 వన్డే మ్యాచ్‌ల్లో మిథాలీ రాజ్ 64 క్యాచ్‌లు అందుకోగా, హర్మన్ 154 మ్యాచ్‌ల్లో 65 క్యాచ్‌లు అందుకుంది. ఇక టీమ్ఇండియా తరుపున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రికార్డు మాజీ పేసర్ ఝులన్ గోస్వామి పేరిట ఉంది. ఆమె 204 మ్యాచ్‌ల్లో 69 క్యాచ్‌లను పట్టుకుంది.
మహిళల క్రికెట్‌లో భారత్ తరుపున అత్యధిక క్యాచ్‌లు అందుకుంది వీరే..
* ఝులన్ గోస్వామి – 204 మ్యాచ్‌ల్లో 69 క్యాచ్‌లు
* హర్మన్ ప్రీత్ కౌర్ – 154 మ్యాచ్‌ల్లో 65 క్యాచ్‌లు
* మిథాలీ రాజ్ – 232 మ్యాచ్‌ల్లో 64 క్యాచ్‌లు
* దీప్తి శర్మ – 114 మ్యాచ్‌ల్లో 40 క్యాచ్‌లు
* రుమేలీ ధర్ – 78 మ్యాచ్‌ల్లో 37 క్యాచ్‌లు
* స్మృతి మంధాన – 110 మ్యాచ్‌ల్లో 35 క్యాచ్‌లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్ (46; 65 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రిచా ఘోష్ (35 నాటౌట్; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా రోడిక్స్ (32; 37 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో డయానా బేగ్ నాలుగు, ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ 43 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సిద్రా అమిన్ (81; 106 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది. టీమ్ఇండియా బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మలు చెరో మూడు, స్నేహ్ రాణా రెండు వికెట్లు సాధించారు.