Courtesy@ESPNCricInfo
Womens World Cup 2025: మన అమ్మాయిలు అదరగొట్టేశారు. చరిత్ర సృష్టించారు. భారత్ ను విశ్వ విజేతగా నిలబెట్టారు. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టైటిల్ ను టీమిండియా కైవసం చేసుకుంది. పైనల్లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. 299 రన్స్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 52 పరుగుల తేడా గ్రాండ్ విక్టరీ కొట్టింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ చెలరేగిపోయింది. 5 వికెట్లు తీసి సౌతాఫ్రికాని గట్టి దెబ్బ కొట్టింది. భారత్ విజయంలో కీ రోల్ ప్లే చేసింది. షెఫాలీ వర్మ 2 వికెట్లు తీసింది. శ్రీ చరణి ఒక వికెట్ పడగొట్టింది.
భారత జట్టులో షెఫాలీ వర్మ బ్యాటింగ్ లోనూ రాణించింది. హాఫ్ సెంచరతో చెలరేగింది. 78 బంతుల్లోనే 87 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. దీప్తి శర్మ హాఫ్ సెంచరీ బాదింది. 58 బంతుల్లో 58 రన్స్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన 45 పరుగులతో మెరిసింది.
47 ఏళ్ల మహిళల వన్డే చరిత్రలో.. భారత జట్టు వరల్డ్ కప్ గెలవడం ఇదే ఫస్ట్ టైమ్. 2005, 2017 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ వరకు వెళ్లినా.. చివరి మెట్టుపై బోల్తా పడింది. 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. 2017లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మెగా ఫైనల్‌లో.. ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా.. ఈసారి తన కలను నెరవేర్చుకుంది. తొలిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది.
Also Read: 4 సిక్సులు, 3 ఫోర్లు బాది టీమిండియాను గెలిపించిన వాషింగ్టన్ సుందర్