Womens World Cup 2025 Semi final Scenario one place 3 teams
Womens World Cup 2025 Semi final Scenario : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో గ్రూప్ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు టోర్నీ నుంచి నిష్ర్కమించాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒక్క సెమీస్ బెర్తు కోసం (Womens World Cup 2025 Semi final Scenario) మూడు జట్లు.. భారత్, న్యూజిలాండ్, శ్రీలంక లు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ జట్టుకు ఎంత అవకాశం ఉంది అన్న విషయాన్ని ఓ సారి చూద్దాం..
టీమ్ఇండియా ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 4 పాయింట్లు జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేటు +0.526గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. టీమ్ఇండియా ఈ టోర్నీలో మరో రెండు మ్యాచ్‌లు న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ సెమీస్‌లో అడుగుపెడుతుంది.
ఒకవేళ గురువారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి, చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై ఓడిపోయిప్పటికి కూడా భారత్ సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కివీస్ పై భారత్ గెలిస్తే అప్పుడు ఆరు పాయింట్లు వచ్చి చేరతాయి. ఆ తరువాత కివీస్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించినా కూడా ఆ జట్టు 6 పాయింట్లు ఉంటాయి. అయితే.. మెరుగైన రన్‌రేట్ కలిగి ఉండడంతో భారత్ సెమీస్‌కు చేరుకుంటుంది.
ఈ టోర్నీలో న్యూజిలాండ్ జట్టు ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఓ మ్యాచ్‌లో గెలవగా, మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. కివీస్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ -0.245గా ఉంది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
ఈ టోర్నీలో కివీస్ మరో రెండు మ్యాచ్‌లు భారత్, ఇంగ్లాండ్ పై ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే కివీస్ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ భారత్ పై గెలిచి ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతే.. అప్పుడు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ పై కివీస్ సెమీస్ బెర్తు ఆధారపడి ఉంటుంది.
ఈ టోర్నీలో శ్రీలంక ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఒక్క మ్యాచ్‌లో గెలవగా మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇంకో రెండు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. నాలుగు పాయింట్లు లంక ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేటు -1.035గా ఉంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
IND vs AUS : పెర్త్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం.. వింత సాకు చెప్పిన బ్యాటింగ్ కోచ్..
లంక జట్టు తమ చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ప్రస్తుతం పాక్ ఉన్న ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే ఈ మ్యాచ్‌లో గెలవడం లంకకు పెద్ద కష్టం కాదు. ఈ మ్యాచ్‌లో గెలిచినప్పటికి కూడా లంక జట్టు సెమీస్ చేరడం భారత్, కివీస్ మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. అదే సమయంలో కివీస్.. భారత్ పై గెలిచి ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవాలి. అంతేకాకుండా కివీస్ నెట్‌రన్‌రేట్ లంక కంటే తక్కువగా ఉండాలి. అప్పుడే శ్రీలంక సెమీస్‌కు చేరుకుంటుంది.
పై మూడు జట్లలో భారత్ సెమీస్‌కు చేరుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.