World Cup 2023 IND Vs PAK
వన్డే ప్రపంచకప్‌లో భారత్ అదరగొడుతోంది. వరుసగా మూడో మ్యాచులోనూ విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (86; 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ (53 నాటౌట్; 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. శుభ్‌మన్ గిల్ (16), విరాట్ కోహ్లీ (16)లు విఫలం అయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు తీశాడు. హసన్ అలీ ఓ వికెట్ పడగొట్టాడు.
విఫలమైన గిల్..
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు బరిలోకి దిగారు. అనారోగ్యం కారణంగా వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమైన గిల్ పాకిస్థాన్ మ్యాచ్‌తోనే రీ ఎంట్రీ ఇచ్చాడు. షాహీన్ అఫ్రీది వేసిన మొదటి ఓవర్‌లో ఓ ఫోర్ కొట్టిన గిల్ హసన్ అలీ వేసిన రెండో ఓవర్‌లో మూడు ఫోర్లు బాది మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. అయితే.. ఆ మరుసటి ఓవర్‌లో షాహీన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 23 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.
Neeraj Chopra : ప్రపంచ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ రేసులో నీరజ్ చోప్రా
అయితే.. మరో వైపు రోహిత్ శర్మ మాత్రం తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. ఏ బౌలర్‌ను లెక్క చేయలేదు. సిక్సర్లు, ఫోర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. కోహ్లీ విఫలమైనా శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో రోహిత్ 36 బంతుల్లోనే అర్థశతకాన్ని అందుకున్నాడు. ఆ తరువాత మరింత దూకుడుగా ఆడాడు. అయితే.. సెంచరీకి మరో 14 పరుగుల దూరంలో షాహీన్ అఫ్రీది బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అప్పటికే భారత విజయం ఖాయమై పోయింది. మిగిలిన పనిని కేఎల్ రాహుల్ (19 నాటౌట్) తో కలిసి శ్రేయస్ అయ్యర్ పూర్తి చేశాడు. అయ్యర్ 62 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు.
pic @BCCI twitter
ఆరంభం అదిరినా..
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజాం (50; 58 బంతుల్లో 7 ఫోర్లు) అర్థశతం చేశాడు. మహ్మద్ రిజ్వాన్ (49; 69 బంతుల్లో 7 ఫోర్లు) ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఇమామ్ ఉల్ హక్ (36), అబ్దుల్లా షఫీక్ (20) లు ఓ మోస్తరుగా రాణించగా.. సౌద్ షకీల్ (6), ఇఫ్తీకర్ అహ్మద్ (4), షాదాబ్ ఖాన్ (2) లు ఘోరంగా విఫలం అయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, హార్ధిక్ పాండ్య, రవీంద్ర జడేజా లు తలా రెండు వికెట్లు తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ కు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్ లు మొదటి వికెట్‌కు 7.6 ఓవర్లలోనే 41 పరుగులు జోడించి శుభారంభం అందించారు. షఫీక్‌ను ఔట్ చేయడం ద్వారా సిరాజ్ భారత్‌కు మొదటి వికెట్‌ను అందించాడు. అయితే.. మరో ఓపెనర్ ఇమామ్‌తో జత కలిసిన కెప్టెన్ బాబర్ ఆజాం టీమ్ఇండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓ వైపు నిలకడగా ఆడుతున్న ఇమామ్‌ను హార్ధిక్ పాండ్య ఔట్ చేశాడు. దీంతో పాకిస్థాన్ 73 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
36 పరుగులకే 8 వికెట్లు..
అయినప్పటికీ పాకిస్థాన్‌కు చింతించాల్సిన పని లేకుండా పోయింది. రిజ్వాన్‌తో కలిసి బాబర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో 57 బంతుల్లో బాబర్ అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని సిరాజ్ విడగొట్టాడు. హాఫ్ సెంచరీ బాది ఊపు మీదున్న బాబర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 82 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
Babar- Rizwan
ఈ దశలో భారత బౌలర్లు విజృంభించారు. కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 33 ఓవర్‌ను వేసిన కుల్దీప్ రెండో బంతికి సౌద్ షకీల్‌ను, ఆఖరి బంతికి ఇఫ్తీకర్ అహ్మద్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. బుమ్రా తన వరుస ఓవరల్లో రిజ్వాన్, షాదాబ్ లను ఔట్ చేయగా, హార్ధిక్ పాండ్యా.. నవాజ్‌ను వికెట్ తీశాడు. ఆఖరి రెండు వికెట్లను జడేజా పడగొట్టారు. ఓ దశలో 155 పరుగులకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన పాక్ 36 పరుగుల తేడాతో ఆఖరి ఎనిమిది వికెట్లు కోల్పోవడం గమనార్హం.