Worst Leave Of The Year Mohammad Rizwan Clean Bowled video viral
Worst Leave Of The Year : క్రికెట్‌లో బ్యాటర్లు బంతిని ఎంత త్వరగా అంచనా వేయగలిగితే అంత ప్రయోజనం. అప్పుడే అనుకున్న రీతిలో షాట్లు కొట్టగలం. బంతిని తప్పుగా అంచనా వేస్తే ఒక్కొసారి వికెట్‌ను మూల్యంగా చెల్లించాల్సిందే. సాధారణంగా టెస్టుల్లో బ్యాటర్లు బంతిని ఎక్కువగా వదిలివేస్తుంటారు. వన్డేల్లో ఇలా చేయడం కాస్త తక్కువగానే ఉంటుంది.
కాగా.. పాక్ ఆటగాడు రిజ్వాన్ మాత్రం విండీస్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతినే వదిలి వేయాలని అనుకున్నాడు. ఇందుకు అతడు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు వరస్ట్ లీవ్ ఆఫ్ ది ఇయర్(Worst Leave Of The Year) అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
వెస్టిండీస్, పాకిస్తాన్ జట్ల మధ్య ట్రినిడాడ్ వేదికగా మంగళవారం మూడో వన్డే మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ షై హోప్ (120 నాటౌట్; 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగాడు. జస్టిన్ గ్రీవ్స్ (43; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎవిన్ లూయిస్ (37; 54 బంతుల్లో 1 ఫోర్, 3సిక్సర్లు), రోస్టన్ చేజ్ (36; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించాడు. పాక్ బౌలర్లలో నసీమ్ షా,
అబ్రార్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీశారు. సైమ్ అయూబ్, మొహమ్మద్ నవాజ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 295 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు ఆదిలో వరుస షాక్‌లు తగిలాయి. ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్ లు డకౌట్లు అయ్యారు. దీంతో పాక్ 2.4 ఓవర్లలో 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మహ్మద్ రిజ్వాన్ క్రీజులోకి అడుగుపెట్టాడు. విండీస్ బౌలర్ సీల్స్ ఇన్ స్వింగింగ్ వేయగా బంతిని తప్పుగా అంచనా వేసిన రిజ్వాన్ బాల్‌ను వదిలివేశాడు(Worst Leave Of The Year).
Asia Cup : రెండు మ్యాచ్‌లే గెలిచి.. ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్..
Maulana Rizwan first ball Duck😭😭😭Imagine getting owned by West Indies and still dreaming about beating India pic.twitter.com/TzV2sp5Cnn
— A (@chadniket) August 12, 2025
బంతి స్టంప్స్ పై భాగాన్ని తాకుతూ వెళ్లడంతో బెయిల్స్ కింద పడ్డాయి. రిజ్వాన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో పాక్ 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తరువాత కూడా విండీస్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పాక్ 29.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. దీంతో విండీస్ 202 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. పాక్ బ్యాటర్లలో ఐదుగురు డకౌట్లు కావడం గమనార్హం. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 6 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు.
గుడాకేష్ మోతీ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ విజయంతో విండీస్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. పాక్ పై వెస్టిండీస్ వన్డే సిరీస్ నెగ్గడం గత 34 ఏళ్లలో ఇదే తొలిసారి.