యూసుఫ్ పఠాన్ పొలిటికల్ ఇన్నింగ్స్.. కాంగ్రెస్ కంచుకోటలో పోటీ

టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్.. లోక్‌స‌భ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు.

Yusuf Pathan Trinamool Congress candidate

Yusuf Pathan : టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నాడు. రానున్న లోక్‌స‌భ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీకి రెడీ అయ్యాడు. బహరంపూర్ నుంచి తృణమూల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను తృణమూల్ కాంగ్రెస్ ఆదివారం ప్రకటించింది. ఏ పార్టీతోనూ పొత్తులేదని, ఒంటరిగా పోటీ చేస్తున్నామని అధికారంగా వెల్లడించింది.

కాంగ్రెస్ కంచుకోట అయిన బహరంపూర్ లోక్‌స‌భ నియోజకవర్గానికి ఆ పార్టీ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బెంగాల్‌కు కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థులను ప్రకటించనప్పటికీ, చౌదరి లోక్‌సభకు ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి మళ్లీ పోటీ చేయాలని కోరుతున్నారు.

41 ఏళ్ల యూసఫ్ పఠాన్ టీమిండియా తరపున 51 వన్డేలు ఆడాడు. 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 810 పరుగులు సాధించాడు. 33 వికెట్లు పడగొట్టాడు. 22 టీ20 మ్యాచ్ ల్లో 237 పరుగులు చేశాడు. టెస్టుల్లో అతడికి చోటు దక్కలేదు.

1999-2000లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో బరోడా అండర్-16 జట్టుకు తొలిసారిగా ఎంపికైన యూసుఫ్ పఠాన్.. తర్వాత బరోడా U-19, వెస్ట్ జోన్ U-19 తరపున ఆడాడు. పొట్టి ఫార్మాట్‌లకు సరిపోయే హార్డ్-హిటింగ్ బ్యాటర్, ఆఫ్‌స్పిన్నర్ గా ఎదిగాడు. 2001-02లో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్ తో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. యూసఫ్ తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ ముందుగా జాతీయ జట్టులో చోటు సంపాదించాడు.

Also Read: బీసీసీఐ టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీం ద్వారా ఒక్కో ప్లేయర్ సంపాదన ఎంత పెరగనుందో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు