BYDs Charging Technology : అవును.. కేవలం 5 నిమిషాలు రీచార్జ్ చేస్తే చాలు 400 కిలోమీటర్లు హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు. ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ, ఇది సాధ్యమే అంటోంది చైనాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ వాహన (EV) తయారీదారు BYD. జస్ట్ 5 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కారును ఫుల్ చార్జ్ చేసే సరికొత్త బ్యాటరీ వ్యవస్థను కనుగొన్నట్లు చైనా దిగ్గజ కంపెనీ బీవైడీ ప్రకటించింది. 5 నిమిషాల చార్జ్‌తో 400 కిలోమీటర్ల వరకు శక్తినివ్వగల అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా ఈవీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది బీవైడీ.
ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ కోసం సరికొత్త వ్యవస్థను ఆవిష్కరించింది బీవైడీ. దీని ద్వారా కేవలం 5 నిమిషాల్లోనే కారును ఫుల్ ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. సాధారణ కారులో పెట్రోల్ లేదా డీజిల్ ట్యాంక్ ను ఫిల్ చేయడానికి ఎంత సమయం పడుతుందో, ఎలక్ట్రిక్ కార్ ను చార్జ్ చేయడానికి కూడా ఇకపై అంత తక్కువ సమయమే పడుతుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త చార్జింగ్ వ్యవస్థ ద్వారా 5 నిమిషాలు ఛార్జ్ చేసే 400 కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యాన్ని కొత్త బ్యాటరీ ఇస్తుంది.
మార్చి 17న, చైనాలోని షెన్‌జెన్‌లోని తన ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో BYD తన సూపర్ ఇ-ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. BYD ఛైర్మన్ వాంగ్ చువాన్‌ఫు ఈ సాంకేతికతపై విశ్వాసం వ్యక్తం చేశారు. “గ్యాస్ ట్యాంక్ నింపినంత వేగంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌ను అందించడమే మా లక్ష్యం” అని ఆయన అన్నారు.
ఈ అద్భుతమైన సాంకేతికత EVల ప్రధాన సమస్యల్లో ఒకటైన ఛార్జింగ్ వేగాన్ని పరిష్కరించగలదని పరిశ్రమ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది సాంప్రదాయ గ్యాస్-శక్తితో నడిచే కార్ల సౌలభ్యానికి సరిపోయేలా EVలను దగ్గరగా తీసుకురాగలదు. మార్కెట్‌లో వాటి స్థానాన్ని బలోపేతం చేస్తుంది.
Also Read : ఐఫోన్ కొంటున్నారా? ఒక్క నిమిషం.. ఇది తెలుసుకోండి..
”BYD ఆవిష్కరించిన అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గేమ్-ఛేంజర్. ఇది భారీగా ఉత్పత్తి చేయబడిన EVలలో 1000V హై వోల్టేజ్, 1000kW ఛార్జింగ్ పవర్ మొట్టమొదటి అప్లికేషన్‌ను సూచిస్తుంది. ఇది నేడు అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన చార్జింగ్ సిస్టమ్‌లలో ఒకటిగా నిలిచింది.
ఇప్పటికే ఉన్న టెక్నాలజీలతో పోలిస్తే ఛార్జింగ్ వేగంలో తేడా స్పష్టంగా ఉంది. ఉదాహరణకు, టెస్లా సూపర్‌చార్జర్ 15 నిమిషాల ఛార్జ్‌తో గరిష్టంగా 275 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. అయితే తాజా మెర్సిడెస్-బెంజ్ CLA ఎలక్ట్రిక్ సెడాన్ కేవలం 10 నిమిషాల ఛార్జ్‌తో 325 కి.మీ.లను సాధించగలదు.
దీనికి విరుద్ధంగా BYD కొత్త సాంకేతికత ఒక వాహనం కేవలం 5 నిమిషాల చార్జ్‌తో 400 కిలోమీటర్లు ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఇది ప్రస్తుత వ్యవస్థలను చాలా మించిపోయింది. ఈ సాంకేతికత విస్తృతంగా అందుబాటులోకి వస్తే, దీర్ఘ ఛార్జింగ్ సమయాల గురించి వినియోగదారుల ఆందోళనలను పరిష్కరించగలదు. ముఖ్యంగా సుదూర ప్రయాణాలలో EVల స్వీకరణను పెంచుతుంది” అని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
వినూత్న ఛార్జింగ్ టెక్నాలజీతో నడిచే హాన్ L సెడాన్, టాంగ్ L SUV కొత్త మోడళ్లను విడుదల చేయడం ద్వారా మార్కెట్లో తనదైన ముద్ర వేస్తోంది బీవైడీ. ఈ వాహనాలు ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి. చైనా అంతటా 4వేల కంటే ఎక్కువ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించాలని BYD యోచిస్తోంది.
BYD కొత్త టెక్నాలజీ.. సాంప్రదాయ గ్యాస్ స్టేషన్లు, చార్జింగ్ మౌలిక సదుపాయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఛార్జింగ్ వేగం గ్యాస్-శక్తితో నడిచే వాహనానికి ఇంధనం నింపినంత వేగంగా మారితే, సాంప్రదాయ గ్యాస్ స్టేషన్ల వ్యాపార నమూనా గణనీయంగా మారాల్సి వస్తుంది.
”BYD కొత్త టెక్నాలజీ.. చార్జింగ్ మౌలిక సదుపాయాలలో టెస్లా ప్రయోజనాన్ని సవాల్ చేస్తోంది. ఇప్పటికే ఉన్న కంపెనీలు ప్రతి స్పందనగా వ్యూహాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది” అని EV ఛార్జింగ్ స్టార్టప్ ఛార్జ్‌వే వ్యవస్థాపకుడు మాట్ టెస్కే అన్నారు.
టెస్లా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ కియా వంటి ప్రపంచ EV లీడర్లకు మధ్య అంతరాన్ని తగ్గించాలని బీవైడీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, BYD ఇంకా నిర్దిష్ట బ్యాటరీ స్పెసిఫికేషన్లను వెల్లడించనందున, కొత్త సాంకేతికత ప్రభావం, విశ్వసనీయతను మరింత ధృవీకరించాల్సిన అవసరం ఉందని నిపుణులు వాదిస్తున్నారు. BYD కొత్త టెక్నాలజీ EV పరిశ్రమలో గేమ్-ఛేంజర్ అవుతుందా? పోటీదారులు ఎలా స్పందిస్తారు? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read : మార్చి 31 వచ్చేస్తోంది.. ఫైన్ నుంచి తప్పించుకోవాలన్నా.. పన్ను ప్రయోజనాలు పొందాలన్నా వెంటనే ఇలా చేయండి..
ఈవీ కార్ల వల్ల పర్యావరణ కాలుష్యం ఉండదు. పెట్రోల్, డీజిల్ లో పోల్చితే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దూరం ప్రయాణం చేయొచ్చు. దీంతో ఎలక్ట్రిక్ కార్లను కొనేందుకు చాలామంది ఇంట్రస్ట్ చూపిస్తున్నా.. ఛార్జింగ్ పాయింట్లు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రాలేదు. ఛార్జ్ చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీవైడీ సరికొత్త బ్యాటరీ వ్యవస్థ ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పు అని చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు. ఐదు నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయితే ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఇంకా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారని వెల్లడించారు.
ప్రస్తుతం విద్యుత్ వాహన రంగంలో టెస్లా అగ్ర స్థానంలో ఉంది. ఈ కంపెనీ సూపర్ ఛార్జర్లతో 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 275 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా టెస్లా సూపర్ ఛార్జర్లు 65వేలకు పైనే ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ గ్రూప్ ఏజీ కూడా ఇటీవలే సీఎల్ఏ ఎలక్ట్రిక్ సెడాన్ ను లాంచ్ చేసింది. దీన్ని 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 325 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
ఈ పరిస్థితుల్లో 5 నిమిషాల్లోనే 400 కిమీ ప్రయాణించగల సామర్థ్యంతో కొత్త చార్జింగ్ వ్యవస్థను బీవైడీ ఆవిష్కరించడం అద్భుతం అంటున్నారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే టెస్లాకు బీవైడీ గట్టీ పోటీ ఇస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో పోటీ మరో లెవెల్ కి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.