ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గూగుల్ జెమిని ఏఐ, “ఓపెన్‌ఏఐ” చాట్‌జీపీటీ దూసుకుపోతుంటే, ఐఫోన్ తయారీదారు ఆపిల్ మాత్రం వెనకబడింది. ఈ గ్యాప్‌ను పూరించడానికి, పోటీలో నిలబడటానికి ఆపిల్ ఇప్పుడు ‘ఆన్సర్ ఇంజిన్’ అనే సరికొత్త ఏఐ చాట్‌బాట్‌ను రహస్యంగా అభివృద్ధి చేస్తోంది.
ఇటీవల ఆపిల్ ప్రవేశపెట్టిన ‘ఆపిల్ ఇంటెలిజెన్స్’ అనుకున్నంత ప్రభావం చూపలేకపోయింది. న్యూస్ సమ్మరీ ఫీచర్ తప్పుడు సమాచారం ఇస్తోందని విమర్శలు వచ్చాయి. అలాగే, ఐఓఎస్ 18.5లో తీసుకురావాల్సిన ఏఐ బేస్డ్ సిరి అప్‌డేట్‌ను కూడా నిలిపివేశారు. ఈ వైఫల్యాల నేపథ్యంలో, ఏఐ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఆపిల్ ఈ ‘ఆన్సర్ ఇంజిన్’ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.
ఏమిటీ ‘ఆన్సర్ ఇంజిన్’?
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ‘ఆన్సర్ ఇంజిన్’ అనేది ఒక శక్తిమంతమైన చాట్‌బాట్. ఇది ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని సేకరించి, వినియోగదారులు అడిగే సంక్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇవ్వగలదు. దీని ప్రధాన లక్ష్యం సిరి, స్పాట్‌లైట్ సెర్చ్, సఫారీ బ్రౌజర్‌లను మరింత మెరుగ్గా మార్చడమే.
ఈ కీలకమైన ప్రాజెక్ట్ కోసం ఆపిల్ “ఆన్సర్స్, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్” (AKI) అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆపిల్ సీనియర్ డైరెక్టర్, గతంలో సిరిని పర్యవేక్షించిన రాబీ వాకర్ ఈ బృందానికి నాయకత్వం వహించనున్నారు. ఈ టీమ్ నేరుగా ఆపిల్ ఏఐ హెడ్ జాన్ జియన్నాండ్రియాకు రిపోర్ట్ చేస్తుంది.
Also Read: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొంటున్నారా? అయితే ఈ 5 వివరాలు తెలుసుకోవాల్సిందే..
ప్రధాన లక్ష్యం ఇదే
ఆపిల్ ఈ ‘ఆన్సర్ ఇంజిన్’ను ప్రత్యేక యాప్‌గా విడుదల చేస్తుందా? లేదా పూర్తిగా సిరిలో విలీనం చేస్తుందా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ, ఏఐ రేసులో నిలదొక్కుకోవడానికి ఆపిల్ వేస్తున్న ఈ అడుగు టెక్ ప్రపంచంలో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.