AI Chatbot
AI Chatbot : చాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఏఐ (Artificial intelligence) టూల్స్ రాకతో ఉద్యోగుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. రానున్న కాలంలో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొని ఏఐ బాట్స్ (AI bots) ను భర్తీ చేసుకుంటాయన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు కంపెనీలు ఈ విధానాన్ని అమలు పర్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. భారత్‌లో ఓ మీడియా ఛానెల్ యాజమాన్యం దేశంలోనే తొలిసారిగా ఏఐ యాంకర్‌ను ప్రవేశపెట్టిన విషయం విధితమే. ఏఐ టెక్నాలజీతో పనిచేసే దీనిపేరు సనా. సనా న్యూస్ చదువుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీనికితోడు హార్వర్డ్ యూనివర్శిటీ కంప్యూటర్ సైన్స్ బోధించేందుకు ఏఐ చాట్‌బాట్‌ను రిక్రూట్ చేసుకోవాలని కసరత్తు చేస్తోంది. దీంతో రానున్న కాలంలో విద్య, మీడియా, ఐటీ, వివిధ రంగాల్లో ఏఐ బాట్స్‌ను అధిక సంఖ్యలో భర్తీ చేస్తారన్న ప్రచారం ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ తమ సంస్థలో 90శాతం మంది ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో ఏఐ బాట్స్‌ను భర్తీ చేసిన విషయం సంచలనంగా మారింది.
బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తున్న ఇ-కామర్స్ స్టార్టప్ కంపెనీ దుకాణ్. ఈ కంపెనీ యాజమాన్యం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 90శాతం మంది ఉద్యోగులను తొలగించి ఏఐతో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈఓ సుమిత్ షా స్వయంగా ట్వీట్ చేశారు. ఏఐ చాట్‌బాట్ కారణంగా మా బృందంలో 90శాతం మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. ఇది కఠిన నిర్ణయమే. అయినా, ఇంత కఠిన నిర్ణయం అవసరమా? అంటే ఖచ్చితంగా అవసరమే. సంస్థల లాభాల వాటాను పెంచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సుమిత్ షా చెప్పారు. తాము తీసుకున్న నిర్ణయం వల్ల కంపెనీ ఖర్చుచేసే మొత్తం 85శాతం తగ్గిందని అన్నారు. అలానే ఒక యూజర్ కి సేవలను అందించే సమయం రెండు గంటల నుంచి మూడు నిమిషాలకు తగ్గిందని సుమిత్ షా చెప్పారు.
We had to layoff 90% of our support team because of this AI chatbot.
Tough? Yes. Necessary? Absolutely.
The results?
Time to first response went from 1m 44s to INSTANT!
Resolution time went from 2h 13m to 3m 12s
Customer support costs reduced by ~85%Here's how's we did it ?
— Suumit Shah (@suumitshah) July 10, 2023
బెంగళూరు కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ నిర్ణయం సరైంది కాదని, ఇలా చేయడం వల్ల రానున్నకాలంలో దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రస్థాయిలో పెరిగిపోతుందని, కంపెనీల్లో ఏఐ చాట్‌బాట్ వినియోగంపై ప్రభుత్వం షరతులు విధించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. నెటిజన్ల కామెంట్లకు స్పందించిన సుమిత్ షా లింక్డ్ ఇన్‌లో తన వివరణ ఇచ్చాడు. కంపెనీ యాజమాన్యాలు లాభదాయకమైన సంస్థలుగా మాత్రమే కొనసాగాలని కోరుకుంటాయి. ఈ క్రమంలో కస్టమర్ కేర్ విభాగంలో ఏఐను వినియోగించడం వల్ల సమయం ఆదా అవటమేకాకుండా, వేగవంతమైన సేవలు అందించవచ్చు. అయితే, ఉద్యోగులను ఏఐ భర్తీ చేయగలదని నేను భావంచడం లేదు. సమర్థవంతమైన ఉద్యోగులకు ఒకే తరహా బాధ్యతలను అప్పగించడం కంటే కంపెనీ అభివృద్ధికి తోడ్పడే ఇతర విభాగాల్లో వారికి విధులను అప్పగించడం సరైన నిర్ణయం అని సుమిత్ పేర్కొన్నాడు.