Google I/O 2026 : మీ మాటే కమాండ్..! జస్ట్ ఏ వీడియో కావాలో చెప్పండి.. యూట్యూబ్ AI మీకోసం వెతికిపెడుతుంది!
Google I/O 2026 : కొత్త ఆస్క్ యూట్యూబ్ ఫీచర్‌తో యూజర్లు ఇప్పుడు రోజూ మాట్లాడే భాషలోనే ప్రశ్నలు అడగవచ్చు. తద్వారా యూట్యూబ్‌లో మీకు కావాల్సిన వీడియోలను అదే వెతికి పెడుతుంది.
Ask YouTube AI feature
- యూట్యూబ్‌లో మీ వాయిస్‌తో వీడియోలు సెర్చ్ చేయొచ్చు
- గూగుల్ ఐ/ఓ 2026లో యూట్యూబ్ కోసం ఆస్క్ ఏఐ ఫీచర్ రిలీజ్
- మీ సొంత భాషలోనే వీడియోల కోసం ఏఐని ప్రశ్నలు అడగొచ్చు
Google I/O 2026 : కాలిఫోర్నియాలోని షోర్లైన్ యాంఫిథియేటర్‌లో జరిగిన గూగుల్ ఐ/ఓ 2026లో గూగుల్ అనేక కీలక ఏఐ అప్డేట్లను ఆవిష్కరించింది. ఈ ఏడాది అతిపెద్ద టెక్ ఈవెంట్లో సుందర్ పిచాయ్ ‘ఆస్క్ యూట్యూబ్’ అనే యూట్యూబ్ కోసం కొత్త ఏఐ-ఆధారిత ఫీచర్‌ను ఆవిష్కరించారు. ఈ కొత్త ఏఐ ఫీచర్ సాయంతో వీడియో సెర్చ్ విధానమే పూర్తిగా మారిపోనుంది. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కీవర్డ్లు కాదు.. సింపుల్ లాంగ్వేజీలోనే ప్రశ్నలు అడగొచ్చు :
కొత్త ఆస్క్ యూట్యూబ్ ఫీచర్‌తో వినియోగదారులు ఇప్పుడు ఒక సాధారణ సంభాషణ మాదిరిగానే ప్రశ్నలు అడగవచ్చు. తద్వారా యూట్యూబ్‌లో వీడియోల కోసం ఈజీగా సెర్చ్ చేయొచ్చు. అంటే.. కేవలం స్మాల్ కీవర్డ్లను టైప్ చేయాల్సిన అవసరం లేదు. వినియోగదారులు తమకు ఏది కావాలో అది సొంత భాషలో అడగవచ్చు. ఏఐ దానికి అనుగుణంగా రెస్పాండ్ అవుతుంది.
ఉదాహరణకు.. ఒక యూజర్ 2026లో అత్యుత్తమ కెమెరా ఫోన్లు ఏవి? లేదా ఇంట్లో ఈజీగా చేయగల ఫిట్నెస్ వ్యాయామాలు చెప్పండి?’ అని అడిగితే.. యూట్యూబ్ ఏఐ ఆ ప్రశ్నను అర్థం చేసుకుని సంబంధిత వీడియోలను సూచిస్తుంది. ఇందులో షార్ట్, లాంగ్ లెన్త్ వీడియోలు రెండూ ఉంటాయి.
గూగుల్ సెర్చ్ ఏఐ మోడ్ ఎక్స్పీరియన్స్ :
ఈ ఫీచర్ గూగుల్ సెర్చ్ ఏఐ మోడ్ మాదిరిగానే పనిచేస్తుందని, అయితే మొత్తం ఎక్స్పీరియన్స్ వీడియో ఫార్మాట్లో ఉంటుందని గూగుల్ చెబుతోంది. ఏఐ, యూజర్ల ప్రశ్నలను అర్థం చేసుకుని ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న కంటెంట్ నుంచి అత్యంత సంబంధిత వీడియోలను ఎంపిక చేస్తుంది.
అంతేకాకుండా యూజర్లు మరిన్ని ప్రశ్నలు అడగడం ద్వారా తమ రిజల్ట్స్ మెరుగుపర్చుకోవచ్చు. ఈ ఫీచర్ ఇంటరాక్టివ్ కన్వర్జేషన్ మాదిరిగా పనిచేస్తుంది. ఇందులో ఏఐ (AI) యూజర్ల అవసరాలను ఈజీగా అర్థం చేసుకోగలదు.
Read Also : Google I/O 2026 : గూగుల్ ఫ్యూచర్ ప్లాన్ రెడీ.. సుందర్ పిచాయ్ 5 అతిపెద్ద AI ప్రకటనలు ఇవే!
పాత సెర్చ్ రిజల్ట్స్ కన్నా భిన్నంగా :
గూగుల్ కంపెనీ ప్రకారం.. ఆస్క్ యూట్యూబ్ రిజల్ట్స్ అనేవి ట్రెడిషనల్ సెర్చ్ లిస్టు మాదిరిగా కనిపించవు. దానికి బదులుగా, యూజర్లు ఏఐ ఆధారిత ఇంటరాక్టివ్ ఆన్సర్లను పొందుతారు. అంతేకాదు.. అవసరమైన వీడియోలను, సంబంధిత సమాచారాన్ని నేరుగా వెతికి పెడుతుంది. యూట్యూబ్‌లో సందర్భోచితమైన సెర్చ్ ఎక్స్ పీరియన్స్ కోసం యూజర్లకు సరైన వీడియోలను తక్కువ సమయంలో గుర్తించేలా ఈ కొత్త ఏఐ సెర్చ్ పనిచేస్తుంది.
ప్రీమియం యూజర్లకు మాత్రమే :
ప్రస్తుతం, ఈ కొత్త ఫీచర్ అమెరికాలోని 18 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు అందుబాటులో ఉంది. (youtube.com/new) ద్వారా యాక్సెస్ చేయవచ్చు. భవిష్యత్తులో ఈ ఫీచర్ మరింత ఎక్కువ మంది యూజర్లకు విస్తరిస్తామని గూగుల్ తెలిపింది.
జెమిని ఓమ్నితో యూట్యూబ్ షార్ట్స్‌లో ఏఐ రీమిక్స్ :
ఆస్క్ యూట్యూబ్‌తో పాటు, గూగుల్ యూట్యూబ్ షార్ట్స్ రీమిక్స్, యూట్యూబ్ క్రియేట్ యాప్‌ల కోసం జెమిని ఓమ్ని సపోర్ట్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు టెక్స్ట్ ప్రాంప్ట్‌లు లేదా ఫొటోలను ఉపయోగించి ఇప్పటికే ఉన్న షార్ట్స్ వీడియోను రీజనరేట్ చేయొచ్చు. ఏఐ వీడియోలోని విజువల్స్, సీన్స్, ఆడియోను అర్థం చేసుకుని మార్పులు చేస్తుంది. ఎడిటింగ్ గతంలో కన్నా చాలా ఈజీ అవుతుంది. మాన్యువల్ ఎడిటింగ్ అవసరం ఇప్పుడు తగ్గుతుందని గూగుల్ చెబుతోంది.
ఏఐ వీడియోలకు డిజిటల్ వాటర్‌మార్క్‌లు :
ఏఐ రూపొందించిన రీమిక్స్ వీడియోలలో డిజిటల్ వాటర్‌మార్క్, మెటాడేటా ట్యాగ్లు, ఒరిజినల్ వీడియోకు సంబంధించిన ఇండికేషన్లు ఉంటాయని గూగుల్ స్పష్టం చేసింది. తద్వారా ఆ కంటెంట్ ఏఐతో క్రియేట్ చేసిందని గుర్తించడం చాలా ఈజీ అవుతుంది. క్రియేటర్లు కోరుకుంటే.. తమ వీడియోలలోని విజువల్ రీమిక్స్ ఫీచర్‌ను డిసేబుల్ చేసుకునే అవకాశం కూడా వారికి ఉంటుంది.
క్రియేటర్ల సేఫ్టీ కోసం కొత్త టూల్ :
లైక్నెస్ డిటెక్షన్ టూల్‌ను ఇప్పుడు 18 ఏళ్లు పైబడిన క్రియేటర్లకు కూడా విస్తరిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ టూల్, క్రియేటర్లు తమ ఐడెంటిటీ లేదా ఫేస్ ఎక్కడ, ఎలా వాడుతున్నారో తెలుసుకోవచ్చు.
గూగుల్ ప్రకారం.. జెమిని ఓమ్ని ఆధారిత రీమిక్స్ ఫీచర్ ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా యూట్యూబ్ షార్ట్స్ రీమిక్స్, యూట్యూబ్ క్రియేట్ యాప్‌లలో అందుబాటులోకి వస్తోంది. భవిష్యత్తులో ఏఐ ప్లేగ్రౌండ్‌తో కూడా లింక్ చేయనున్నారు.
