Google Pay starts charging Rs 3 convenience fee on mobile recharges
Google Pay Fee : ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే తమ యూజర్లకు షాకిచ్చింది. గూగుల్ పేలో యూపీఐ సర్వీసులను ఉపయోగించి తమ మొబైల్ ఫోన్‌లను రీఛార్జ్ చేయాలనుకునే వినియోగదారులపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. గూగుల్ పేలో మొబైల్ రీఛార్జ్‌లపై కన్వీనియన్స్ ఫీజు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఫీజు కింద వినియోగదారుల నుంచి ప్రతి రీఛార్జ్‌పై రూ. 3 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ పే ద్వారా ప్రీపెయిడ్ ప్లాన్‌లను కొనుగోలు చేసినప్పుడు ఈ రుసుము వర్తిస్తుంది.
పేటీఎం మాదిరిగానే గూగుల్ పే ఛార్జీలు :
గతంలో మొబైల్ రీఛార్జ్ లావాదేవీలపై అదనపు ఛార్జీ విధించకూడదని నిర్ణయించింది. కానీ, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇటీవల పోటీదారు ప్లాట్‌ఫారాలైన పేటీఎం, ఫోన్‌పే వంటి ఇతర పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు ఇదే తరహాలో ఛార్జీలను విధిస్తున్నాయి.
Read Also : UPI Transaction Limit : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? గూగుల్ పే నుంచి పేటీఎం దాకా రోజుకు ఎంత డబ్బు పంపొచ్చు?
గూగుల్ పే కూడా వీటి బాటలోనే మొబైల్ ఛార్జీలపై కన్వీయన్స్ ఫీజును విధిస్తోంది. గూగుల్ పేమెంట్ యాప్‌లో రుసుములను విధించడంపై అధికారికంగా ప్రకటించలేదు. కానీ, వినియోగదారులు ఆన్‌లైన్‌లో జియో రూ.749 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కొనుగోలు చేయగా.. రూ. 3 కన్వీనియన్స్ రుసుము విధించినట్టు తెలిపారు.
నివేదికల ప్రకారం.. ఈ కొత్త ఛార్జీ యూపీఐ, కార్డ్ లావాదేవీలు రెండింటికీ వర్తిస్తుంది. రీఛార్జ్ ప్లాన్‌లలో రూ. 100లోపు ఉంటే ఎలాంటి రుసుము వర్తించదు. అయితే, రూ. 100 నుంచి రూ. 200, రూ. 200 నుంచి రూ. 300 మధ్య ప్లాన్‌లపై వరుసగా రూ. 2 నుంచి రూ. 3 వసూలు చేస్తోంది.
Google Pay convenience fee
అంతేకాదు.. రూ.300కు మించి లావాదేవీలపై అదనంగా రూ. 3 రుసుము విధిస్తోంది. ఇటీవలే గూగుల్ భారతీయ యూజర్ల కోసం సర్వీసు నిబంధనలను అప్‌డేట్ చేసింది. లావాదేవీని పూర్తి చేయడానికి ముందు వర్తించే ఫీజుల గురించి యూజర్లకు తెలియజేయనున్నట్టు నిబంధనలు పేర్కొన్నాయి. కంపెనీ ఇష్టానుసారం కొత్త ఫీజులను నిర్ణయించే అవకాశం లేకపోలేదు.
ఇలా చేస్తే ఎలాంటి ఛార్జీ పడదు :
ఆసక్తికరంగా, అప్‌డేట్ చేసిన కొత్త నిబంధనలు ఉన్నప్పటికీ.. గూగుల్ పేలో ఫోన్ నంబర్‌ను రీఛార్జ్ చేసినప్పుడు ఎయిర్‌టెల్, జియో రీఛార్జ్ ప్లాన్‌లపై అదనపు ఛార్జీలు విధించలేదు. అంటే.. దీనిర్థం.. కొత్త ఛార్జీలు పడకుండా ఉండాలంటే.. టెలికం ఆపరేటర్ అధికారిక వెబ్‌సైట్ నుంచి నేరుగా రీఛార్జ్ ప్లాన్‌లను కొనుగోలు చేయడం ఒక్కటే మార్గం అని తెలుస్తోంది.
గూగుల్ పే మాదిరిగా ఇతర పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్‌లు మొబైల్ రీఛార్జ్ కొనుగోలుపై ఛార్జీలు విధిస్తున్నాయి. ఫుడ్ ఆర్డర్ చేయడం లేదా సినిమా టిక్కెట్‌లను బుక్ చేయడం వంటి లావాదేవీలపై కూడా వివిధ ఆన్‌లైన్ సర్వీసుల ద్వారా ఇలాంటి ఛార్జీలనే అమలు చేస్తున్నాయి.