D2M Technology
D2M Technology : అతి త్వరలో భారత మార్కెట్లో ఇంటర్నెట్ లేకుండానే మొబైల్ ఫోన్ల నుంచి డైరెక్ట్ టీవీ, OTT కంటెంట్‌ను వీక్షించవచ్చు. ప్రముఖ ఫిన్నిష్ మొబైల్ ఫోన్ తయారీదారు HMD, భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా, ఫ్రీస్ట్రీమ్ టెక్నాలజీస్ ఇతర D2M పార్టనర్లతో డైరెక్ట్-టు-మొబైల్ (D2M) ఎనేబుల్డ్ ఫోన్‌లను విడుదల చేయనున్నాయి.
డైరెక్ట్-టు-మొబైల్ (D2M) టెక్నాలజీతో కూడిన ఫోన్లను భారత మార్కెట్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు HMD గ్లోబల్ ప్రకటించింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) 2025 సందర్భంగా కంపెనీ ఈ ప్రకటన చేసింది. మే 1 నుంచి మే 4 వరకు ముంబైలో జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) సందర్భంగా HMD D2M ఫోన్‌లను ఆవిష్కరించనుంది.
అదే సమయంలో, లావా, టాటా గ్రూప్‌లో భాగమైన తేజస్ నెట్‌వర్క్స్ అనుబంధ సంస్థ సాంఖ్య ల్యాబ్స్ ద్వారా ఇంటిగ్రేటెడ్ SL3000 చిప్‌తో మీడియాటెక్ MT6261 సిస్టమ్-ఆన్-చిప్‌తో రన్ అయ్యే ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించనుంది. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్‌లో టీవీ రిసెప్షన్ కోసం UHF యాంటెన్నా, వాయిస్ కాల్స్ కోసం GSM సపోర్టు, 2.8-అంగుళాల QVGA డిస్‌ప్లే, 2,200mAh బ్యాటరీ కూడా ఉంటాయి.
డైరెక్ట్-టు-మొబైల్ (D2M) టెక్నాలజీ ఏంటి? :
D2M అనేది పూర్తిగా కొత్త బ్రాడ్‌క్యాస్ట్ టెక్నాలజీ. OTT, లైవ్ టీవీ, వీడియో, ఆడియో, టెక్స్ట్ మెసేజ్‌లను Wi-Fi లేదా ఇంటర్నెట్ లేకుండా మొబైల్ ఫోన్‌లకు నేరుగా డెలివరీ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ ‘డిజైన్ ఇన్ ఇండియా’ క్యాంపెయిన్ కూడా బలోపేతం చేస్తుందని కంపెనీ చెబుతోంది.
స్ట్రీమింగ్ కోసం 5G నెట్‌వర్క్ అవసరం ఉండదు :
2024 నివేదిక ప్రకారం.. D2M వీడియో ట్రాఫిక్‌లో 25 శాతం నుంచి 30 శాతం వరకు 5G నెట్‌వర్క్‌ల అవసరాన్ని తగ్గిస్తుందని సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర వివరించారు. మొబైల్ నెట్‌వర్క్‌ల ట్రాఫిక్ తగ్గించడమే కాకుండా దేశవ్యాప్తంగా డిజిటల్ పరంగా వేగవంతం చేసేందుకు వీలుంటుంది.
D2M టెక్నాలజీతో దాదాపు 9 కోట్ల టెలివిజన్ సర్వీసు లేని ఇళ్లకు వీడియో కంటెంట్ ఇంటిగ్రేట్ చేయగలదని చంద్ర అన్నారు. పెద్ద ఎత్తున స్వీకరిస్తే.. D2M డేటా ట్రాన్స్‌మిషన్ ఖర్చును తగ్గించి, నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయొచ్చు.
19 నగరాల్లో D2M ట్రయల్స్ :
భారత ప్రభుత్వం ఢిల్లీ, బెంగళూరు, నోయిడాతో సహా 19 నగరాల్లో ప్రాథమిక D2M ట్రయల్స్ నిర్వహించింది. నివేదిక ప్రకారం.. ఈ ట్రయల్స్ విజయవంతం కాగా, 2024 చివరి నాటికి ప్రసార భారతి D2M వాణిజ్య సాధ్యాసాధ్యాలపై భారీగా ట్రయల్స్‌కు ఆమోదం కోరింది.
ఈ ట్రయల్స్ ఆధారంగా కేంద్రానికి వివరణాత్మక ప్రతిపాదనను సమర్పించింది. పూర్తి స్థాయి ట్రయల్ ప్రారంభ తేదీ కచ్చితంగా తెలియన్నప్పటికీ అతి త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫలితాలు అనుకూలంగా ఉంటే.. ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావచ్చు.
తయారీ ఖర్చు ఎంతంటే? :
D2M ఫోన్‌లకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే సిగ్నల్స్ పొందడానికి ప్రత్యేకమైన హార్డ్‌వేర్, స్పెషల్ డెడికేటెడ్ చిప్ అవసరం. మొబైల్ డివైజ్ సిగ్నల్‌లను కచ్చితంగా డీకోడ్ చేసేందుకు ఈ హార్డ్‌వేర్ చాలా అవసరం. నివేదిక ప్రకారం.. D2M చిప్‌సెట్‌ను ఇంటిగ్రేట్ చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్ తయారీ ఖర్చు యూనిట్‌కు రూ.2,500 వరకు పెరుగుతుంది.
అయితే, SL3000 D2M చిప్‌సెట్ సంస్థ సాంఖ్య ల్యాబ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ నాయక్ మాట్లాడుతూ.. ఒక్కో డివైజ్‌కు ఖర్చు అదనంగా రూ.120 నుంచి రూ. 200 వరకు తగ్గుతుందని అన్నారు. భారత ప్రభుత్వం అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు D2M సపోర్టును తప్పనిసరి చేయలేదన్నారు.
కంపెనీ SL-3000 చిప్‌సెట్, కోర్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిందని, తద్వారా ప్రకటనలు, ఎడ్యుకేషనల్ కంటెంట్, అత్యవసర హెచ్చరికలను నేరుగా వినియోగదారులకు అందించవచ్చని అన్నారు.
ట్రయల్స్ తర్వాత ఇప్పుడు D2M ఫోన్‌లను భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడంపై HMD దృష్టి సారించింది. అతి త్వరలో వినియోగదారులు ఇంటర్నెట్ అవసరం లేకుండానే టీవీ నుంచి నేరుగా ఎంటర్‌టైన్మెంట్ వీక్షించవచ్చు. అంతేకాదు.. తక్కువ ధరలోనే స్మార్ట్‌ఫోన్‌లు, ఫీచర్ ఫోన్‌లు, టాబ్లెట్‌లను కొనుగోలు చేయొచ్చు.