TRAI Caller ID
TRAI Caller ID : మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ట్రూ కాలర్ తరహాలో అతి త్వరలో స్వదేశీ కాలర్ ఐడీ వెర్షన్ రాబోతుంది. ఫేక్ కాల్స్ చెక్ పెట్టేందుకు ఇకపై ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధార పడాల్సిన పనిలేదు. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ప్రతిపాదనకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆమోదం తెలిపింది.
ఈ కొత్త సిస్టమ్ ద్వారా మొబైల్ (TRAI Caller ID) రిసీవర్ ఫోన్ స్క్రీన్‌పై కాలర్ రియల్ నేమ్ మాత్రమే కనిపించనుంది. కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) అనే పేరుతో ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. ఇన్‌కమింగ్ కాల్స్ విషయంలో ఏది ఫేక్ కాల్ ఏది రియల్ అనే తేడా ఈజీగా వినియోగదారులు తెలుసుకునేలా ఉండేలా ట్రాయ్ ఈ కొత్త సిస్టమ్ ప్రవేశపెడుతోంది. అంటే.. సిమ్ వెరిఫికేషన్ సమయంలో ఇచ్చిన డేటా ఆధారంగా కాల్ చేస్తున్న వ్యక్తి పేరును CNAP ఆటోమాటిక్‌గా చూపిస్తుంది అనమాట.
టెలికాం ఆపరేటర్‌తో రిజిస్టర్ అయిన యూజర్ పేరు మాత్రమే కనిపిస్తుంది. టెలికాం కంపెనీల అధికారిక సబ్‌స్క్రైబర్ డేటాబేస్ నుంచి డేటా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లందరికి ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా అందుబాటులోకి వస్తుందని ట్రాయ్ తెలిపింది. అయితే, ఈ ఫీచర్ వద్దనుకునే సబ్‌స్క్రైబర్‌లు తమ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ (TSP)ని సంప్రదించి వైదొలగవచ్చు.
ఈ విధానం ప్రైవసీతో పాటు కంట్రోలింగ్ కూడా అందిస్తుంది. స్పామ్, మోసాల బారి నుంచి యూజర్లను ప్రొటెక్ట్ చేస్తుంది. కాల్‌కు ఆన్సర్ చేయడానికి ముందే కాలర్ పేరు కనిపిస్తుంది. తద్వారా స్పామ్ లేదా స్కామ్ కాల్ అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ అది స్పామ్ కాల్ అని తెలిస్తే యూజర్ ఆన్సర్ చేయకుండా ఉండొచ్చని రెగ్యులేటర్ పేర్కొంది.
4జీ, 5జీ నెట్‌వర్క్‌లలో CNAP ఫీచర్ ట్రయల్ :
టెలికమ్యూనికేషన్స్ విభాగం ఎంపిక చేసిన నగరాల్లోని 4G, 5G నెట్‌వర్క్‌లలో CNAP ఫీచర్ ట్రయల్‌ను నిర్వహించింది. పరీక్ష దశలో అవసరమైన సాఫ్ట్‌వేర్ ప్యాచ్‌లు లేకపోవడం, అదనపు నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌ల అవసరం వంటి అనేక సాంకేతిక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ పరిమితుల కారణంగా వాయిస్ కాల్స్ కోసం ఉపయోగించే సాంప్రదాయ సర్క్యూట్-స్విచ్డ్ నెట్‌వర్క్‌ల కన్నా మొబైల్ డేటా, VoIP కాల్‌లను నిర్వహించే ప్యాకెట్-స్విచ్డ్ నెట్‌వర్క్‌ల కోసం మాత్రమే ట్రయల్స్ నిర్వహించింది.
వారం రోజుల్లో కాలర్ ఐడీ సర్వీసు :
టెలికమ్యూనికేషన్ల విభాగం టెలికాం కంపెనీలను వచ్చే వారంలోపు కనీసం ఒక సర్కిల్‌లో CNAP సర్వీసును ప్రారంభించాలని కోరింది. ఆ తర్వాత, క్రమంగా దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని సూచించింది. కంపెనీల నుంచి టెక్నికల్ ట్రయల్ రిపోర్టులను కూడా DoT కోరింది. కాలర్ నేమ్ డిస్‌ప్లే సర్వీసు డిజిటల్ భద్రతను ప్రోత్సహించడంతో పాటు మోసాలను నివారిస్తుందని డాట్ పేర్కొంది.
CNAP ఫీచర్ ఎలా పని చేస్తుంది? :
సీఎన్ఏపీ ఫీచర్ టెలికాం కంపెనీల నెట్‌వర్క్ స్థాయిలో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఎవరైనా కాల్ చేసినప్పుడు లేదా కాల్ చేసిన వ్యక్తి పేరు (KYC రికార్డుల ప్రకారం) స్వీకరించే యూజర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ ఫీచర్ ట్రూకాలర్ వంటి యాప్‌లకు భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ ఆమోదం కింద అందరి యూజర్లకు ఒకే విధంగా కనిపిస్తుంది.
ప్రైవసీపరంగా నో ఇష్యూ :
సీఎన్ఏపీ ఫీచర్ ద్వారా యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ప్రభావం ఉండదని DoT స్పష్టం చేసింది. మొబైల్ సిమ్ కొనుగోలు సమయంలో సమర్పించిన KYC డాక్యుమెంట్లలో అందించిన పేరు మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. అదనపు డేటా షేర్ చేయదు.
1. CNAP అంటే ఏంటి?
సీఎన్ఏపీ అంటే.. కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ అనే కొత్త సర్వీసు. ఇందులో కాల్ వచ్చినప్పుడు కాలర్ రియల్ నేమ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
2. ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
రాబోయే వారంలోపు కనీసం ఒక సర్కిల్‌లో ప్రారంభించాలని టెలికాం కంపెనీలను DoT ఆదేశించింది.
3. ఈ ఫీచర్ ట్రూకాలర్ మాదిరిగా పనిచేస్తుందా?
లేదు.. CNAP అనేది ప్రభుత్వం ఆమోదించిన సర్వీసు. సిమ్ కేవైసీ డేటాపై ఆధారపడి పనిచేస్తుంది.
4. కాలర్ ఐడీతో ప్రైవసీకి భంగం కలిగిస్తుందా?
లేదు.. CNAP సిమ్ వ్యాలీడ్ కేవైసీ పేరును మాత్రమే చూపుతుంది. వ్యక్తిగత సమాచారం షేర్ కాదు.