జయహో ఇస్రో..PSLV-C48 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)చరిత్ర సృష్టించింది. పీఎస్‌ఎల్‌వీ సీ-48 ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. 5సంవత్సరాల పాటు పీఎస్ఎల్పీ సీ48 సేవలందించనున్నట్లు ఆయన తెలిపారు. శాస్త్రవేత్తల బృందానికి శివన్ అభినందనలు తెలిపారు.

310 విదేశీ ఉపగ్రహాల్ని నింగిలోకి చేర్చిన ఇస్రో ఈ ప్రయోగం విజయవంతంతో ఆ సంఖ్య 319కి చేరింది. శ్రీహరికోట నుంచి ఇది 75వ ప్రయోగం. ఇస్రో ప్రయోగాల్లో పీఎస్ ఎల్పీ రాకెట్ కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రాకెట్లలో ఇది ఒకటి. ఇప్పటివరకూ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌ నుంచి 49పీఎస్ఎల్వీ మెషీన్లు లాంచ్ అయిన విషయం తెలిసిందే. 49 ప్రయోగాల్లో రెండు మాత్రమే విఫలమయ్యాయి.

ఇవాళ(డిసెంబర్-11,2019) పీఎస్ఎల్పీ 50వ మిషన్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ వాహకనౌక ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 11 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. భారత్‌కు చెందిన ఆర్‌ఐఎస్‌ఎటి-2బి ఆర్‌ఐ1 ఉపగ్రహంతోపాటు మరో తొమ్మిది విదేశీ నానో ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. నానో ఉపగ్రహాల్లో ఇజ్రాయిల్‌, ఇటలీ, జపాన్‌కు సంబంధించి ఒక్కటి చొప్పున, ఎఎస్‌ఎకు చెందిన ఆరు ఉన్నాయి.

భూ వాతావరణం,విపత్తులతో పాటుగా రక్షణరంగానికి కూడా రీశాట్-2 బీఆర్1 ఉపగ్రహం ఉపయోగపడనుంది. 35 సెంటీమీటర్ల దూరంలోని వస్తువులను కూడా రీశాట్-2 బీఆర్1 సృష్టంగా చూపించగలదు.