చైనా పాపులర్ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ మళ్లీ ఇండియాకు వస్తోందా? ప్రముఖ మైక్రోసాఫ్ట్ దిగ్గజం టిక్ టాక్ యాప్ కొనుగోలు చేస్తుందా? అదే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఒక్క చైనా మినహా ప్రపంచమంతా టిక్ టాక్ కార్యకలాపాలను నిర్వహించాలని మైక్రోసాఫ్ట్ ప్రయత్నిస్తోంది. భారత్ సహా అమెరికాలోనూ టిక్ టాక్ యాప్ పై నిషేధం ఎదుర్కొంటోంది.. అందుకే భారత్ సహా యూరప్ వంటి యాప్ మార్కెట్లలో టిక్ టాక్ కార్యకలాపాలను నిర్వహించేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ టిక్ టాక్ పేరంట్ కంపెనీ బైట్ డాన్స్ తో చర్చలు జరుపుతోంది.
అమెరికాలోనూ టిక్‌టాక్ కొనుగోలుపై ప్రయత్నాలు ప్రారంభమైయ్యాయని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. 2020 సెప్టెంబర్ 15 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. నివేదికల ప్రకారం.. మైక్రోసాఫ్ట్ కేవలం అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలు మాత్రమే కాదు… కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోనూ తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తోంది. అన్ని మార్కెట్లలో టిక్‌టాక్ కార్య కలాపాలను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ ఒక ప్రణాళికను రూపొందించిందని నివేదిక తెలిపింది.
ఇండియాలో 650 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో టిక్‌టాక్ అతిపెద్ద మార్కెట్ ఉంది.. అయితే, జూన్ చివరిలో నిషేధం తరువాత ఈ యాప్ దేశంలో అందుబాటులో లేకుండా పోయింది. భద్రతా సమస్యలను పేర్కొంటూ టిక్‌టాక్, చైనాతో అనుసంధానమైన 58 ఇతర యాప్‌లను కూడా భారత్ నిషేధించింది. మైక్రోసాఫ్ట్-బైట్ డాన్స్ ఒప్పందం భారత కార్యకలాపాల కోసం కూడా చర్చిస్తోందని నివేదిక పేర్కొంది.
బైట్ డాన్స్ టిక్ టాక్‌ను ఇతర విదేశీ పెట్టుబడిదారులకు లేదా భారతీయ కంపెనీలకు అమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టిక్ టాక్ లేదా యాప్స్ చైనాతో ఏ వ్యాపారం చేయకూడదని నిషేధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బైట్‌డాన్స్‌పై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.