Pakistan Hackers
Pakistan Hackers : పహల్గాం ఉగ్రవాద దాడిలో (బైసరన్ లోయలో) 26 మంది భారతీయ అమాయకులను ఉగ్రవాదులు బలితీసుకున్న తరువాత ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పొరుగు దేశంలోని 9 ఉగ్రవాద శిబిరాలను (మే 7న) భారత్ ధ్వంసం చేసింది.
ఏ పౌరులకు హాని కలిగించకుండా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దేశంలోని ఆర్థిక, కీలకమైన మౌలిక సదుపాయాల రంగాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని వారి సైబర్ ప్రొటెక్షన్ పెంచుకోవాలని కోరుతూ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) ఒక వివరణాత్మక సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ విడుదల చేసింది.
సైబర్ భద్రతను బలోపేతం చేయాలని బ్యాంకులు, ఆర్థిక రంగాలను కోరింది. CERT-In ప్రకారం.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముఖ్యంగా పాకిస్తాన్ ఆధారిత గ్రూపుల నుంచి సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉంది.
ఏదైనా అనుమానాస్పద ఆన్‌లైన్ కార్యకలాపాలను గుర్తించి తగ్గించడానికి ఇంటర్నల్ వార్నింగ్ యంత్రాంగాలు, పర్యవేక్షణ వ్యవస్థలను మెరుగుపరచాలని అడ్వైజరీ సిఫార్సు చేస్తోంది.
రియల్-టైమ్ వార్నింగ్స్, ఇతర నెట్‌వర్క్‌లకు మరింత ప్రొటెక్షన్ అందించేందుకు NASSCOM వంటి పరిశ్రమ సంస్థలతో సహకరించాలని సంస్థలను ప్రోత్సహించారు.
సోషల్ మీడియా, తెలియని నంబర్లతో సైబర్ బెదిరింపులు :
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం వ్యక్తులను హెచ్చరించింది. తెలియని నంబర్లు లేదా అకౌంట్ల ద్వారా పంపిన హానికరమైన లింక్‌లు లేదా ఫేక్ ఫైల్‌ల ద్వారా వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఎక్కువగా ఉంది.
ఈ ఫైల్స్ ఫన్నీ వీడియోలు లేదా వైరల్ కంటెంట్ (ఉదాహరణకు.. “డాన్స్ ఆఫ్ ది హిల్లరీ”) మాదిరిగా హానిచేయనివిగా కనిపించవచ్చు. కానీ, స్మార్ట్‌ఫోన్‌లు లేదా పీసీలను హ్యాక్ చేసే మాల్వేర్ లేదా స్పైవేర్ కావచ్చు. ఒకసారి ఇన్‌ఫెక్షన్‌కు గురైన తర్వాత భద్రతలోపం కలిగిన డివైజ్‌లపై పెద్ద ఎత్తున డేటా ఉల్లంఘనలకు ఉపయోగించే ప్రమాదం ఉంది.
ఆపరేషన్ సిందూర్.. పెరుగుతున్న ఉద్రిక్తతలు :
మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రమైంది. సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది.
ఈ ఆపరేషన్ తర్వాత, పాకిస్తాన్‌లోని శత్రువుల నుంచి డిజిటల్ బెదిరింపులు పెరుగుతున్నాయని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. CERT-In పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు రెండూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.