X Accounts Block : భారత్-పాక్ ఉద్రిక్తత.. భారత్‌లో 8 వేలకు పైగా ‘ఎక్స్’ అకౌంట్లు బ్లాక్.. ఫేక్ న్యూస్ కట్టడికి ఆదేశాలు..!
X Accounts Block : భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య కేంద్ర ప్రభుత్వం దేశంలో 8వేలకు పైగా ఎక్స్ అకౌంట్లను బ్లాక్ చేసింది.

X Accounts Block
X Accounts Block : భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా, భారత ప్రభుత్వం సోషల్ మీడియా అకౌంట్లపై కఠిన చర్యలు చేపట్టింది. దేశంలో 8 వేలకు పైగా ఎక్స్ అకౌంట్లను బ్లాక్ చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు ఎలన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ను భారత ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాత ఎక్స్ ఇప్పుడు ఈ ఖాతాలను బ్లాక్ చేస్తోంది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వెనుక అసలు కారణాలేంటో వివరంగా తెలుసుకుందాం.
పహల్గాం దాడి జరిగిన రెండు వారాల తర్వాత భారత్, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా దాడులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంది.
దేశంలో 8వేల X అకౌంట్లపై నిషేధం :
ఇంతలో, భారత ప్రభుత్వం గురువారం దేశంలో 8వేల ఎక్స్ అకౌంట్లను నిషేధించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ కంపెనీని ఆదేశించింది. ఆ తర్వాత ఈ ఖాతాలను ఎక్స్ బ్లాక్ చేసింది.
ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ అకౌంట్లను బ్లాక్ చేస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు అందాయని ఎక్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
8,000 ఎక్స్ అకౌంట్లను నిషేధించడానికి ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసిందని కూడా ఎక్స్ ప్లాట్‌ఫారం తెలిపింది.
జమ్మూ ఎయిర్‌పోర్టుపై పాకిస్తాన్ టార్గెట్ చేసిన తర్వాత 8 వేలకు పైగా ఎక్స్ అకౌంట్లను నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ అకౌంట్ల బ్లాక్‌ను ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ బృందం నివేదించింది. ఈ X అకౌంట్లను బ్లాక్ చేయకపోతే కంపెనీకి భారీ జరిమానాలు విధించాల్సి వస్తుందని, స్థానిక ఉద్యోగులు కూడా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఫేక్ న్యూస్ కట్టడికి ఆదేశాలు :
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తూ భారతీయులను రెచ్చకొట్టేందుకు పాక్ ప్రయత్నాలు చేస్తోంది. పాక్ చర్యలను తిప్పికొట్టేందుకు భారత ప్రభుత్వం సోషల్ మీడియా అకౌంట్లను నిషేధిస్తోంది. బ్లాక్ చేసిన ఈ ఎక్స్ అకౌంట్లలో అంతర్జాతీయ వార్తా సంస్థలు, అనేక మంది ప్రముఖ వ్యక్తుల ఖాతాలు ఉన్నాయి.
చాలా సందర్భాలలో ఈ ఖాతాల నుంచి ఏ పోస్టులు భారత చట్టాలను ఉల్లంఘించాయో ప్రభుత్వం పేర్కొనలేదని పేర్కొంది. బ్లాక్ చేసిన అకౌంట్ల కారణాలను కూడా వెల్లడించలేదు. దేశంలో తమ ప్లాట్‌ఫామ్ నిర్వహణకు భారత్ ఆదేశాలను పాటించాలని నిర్ణయించుకున్నట్టు ఎక్స్ కంపెనీ పేర్కొంది.
OTT ప్లాట్‌ఫారమ్స్, ఇతర కంటెంట్‌పై నిషేధం :
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2021 నాటి సమాచార సాంకేతిక నియమాల ప్రకారం.. ఒక అడ్వైజరీ జారీ చేసింది. అన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లు పాకిస్తాన్‌కు చెందిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.
ఇటీవల పహల్గాం ఉగ్రవాద దాడిలో అనేక మంది భారతీయులు, ఒక నేపాలీ జాతీయుడు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్‌తో ఉగ్రవాద సంబంధాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.