Paytm gets approval to add new UPI Users
Paytm UPI Users : పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ కంపెనీ పేటీఎంకు భారీ ఊరట లభించింది. 8 నెలల నిషేధం తర్వాత పేటీఎం కొత్త యూపీఐ యూజర్లను చేర్చుకునేందుకు ఆమోదం లభించింది. పేటీఎంలోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్లాట్‌ఫారమ్‌కు కొత్త యూజర్లను చేర్చుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుంచి అనుమతి పొందింది.
పేటీఎం అనేక రెగ్యులేటరీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండటంతో అక్టోబర్ 22, 2024 నుంచి ఈ ఆమోదం అమల్లోకి వచ్చింది. పేటీఎం బీఎస్ఈ ఫైలింగ్ ప్రకారం.. కంపెనీ రిస్క్ మేనేజ్‌మెంట్, యాప్ బ్రాండింగ్, కస్టమర్ డేటాతో సహా ఎన్‌పీసీఐ మార్గదర్శకాలకు కచ్చితంగా కట్టుబడి ఉండాలి. నియంత్రణ సమస్యల కారణంగా 2024 ప్రారంభం నుంచి కొత్త యూపీఐ యూజర్లను పొందలేకపోయింది. 8 నెలల తర్వాత ఎన్‌పీసీఐ ఆమోదంతో పేటీఎంకు భారీ ఉపశమనాన్ని కలిగించింది.
పేటీఎంపై బ్యాన్ ఎందుకంటే? :
జనవరి 2024 నుంచి కొత్త యూపీఐ యూజర్లను పొందడంలో పేటీఎం విఫలమైంది. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని కార్యాచరణ మార్గదర్శకాలను పాటించకపోవడమే కారణమని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకంగా, రిస్క్-సంబంధిత ప్రక్రియల నిర్వహణ, డేటా రక్షణ నిబంధనలకు కట్టుబడిపై పేటీఎం ఆందోళనల కారణంగా నిషేధానికి గురైంది.
పేటీఎం కస్టమర్ పేమెంట్ డేటా స్టోరేజీ సమస్యలు, నియంత్రణ అధికారులు తప్పనిసరి చేసిన కొన్ని రిస్క్ మేనేజ్‌మెంట్ పద్ధతులకు పూర్తిగా అనుగుణంగా లేదని నివేదికలు సూచించాయి. డిజిటల్ పేమెంట్లలో కీలకమైన యూపీఐ యూజర్ బేస్‌ను విస్తరించలేకపోయింది. నిషేధం సమయంలో పేటీఎం ఈ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సి వచ్చింది.
పేటీఎంపై బ్యాన్ ప్రభావం :
యూజర్ బేస్‌ను పెంచుకోవడంలో పేటీఎం విఫలమైంది. తద్వారా యూపీఐ లావాదేవీలలో పేటీఎం మార్కెట్ వాటా గణనీయంగా తగ్గింది. ఆర్బీఐ పరిమితికి ముందు పేటీఎం యూపీఐ పేమెంట్లలో 13 శాతం వాటాను కలిగి ఉంది. అయితే, కొత్త యూజర్లు లేకపోవడంతో పేటీఎం మార్కెట్ వాటా 8 శాతానికి తగ్గింది. ఈ కాలంలో, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే, గూగుల్ పే వంటి పోటీదారులు యూపీఐ మార్కెట్‌పై తమ పట్టును బలోపేతం చేసుకున్నారు. ఈ రెండు కంపెనీలు ఇప్పుడు భారత మార్కెట్లో 87 శాతం యూపీఐ లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్నాయి.
పేటీఎం పుంజుకోగలదా? :
ఇప్పుడు నిషేధం ఎత్తివేయడంతో యూపీఐ స్పేస్‌లో పేటీఎం తిరిగి ఊపందుకుంటుందని భావిస్తున్నారు. అయితే, ఎన్‌పీసీఐ కఠినమైన షరతులతో ఆమోదించింది. రిస్క్ మేనేజ్‌మెంట్, కస్టమర్ డేటా ప్రొటక్షన్ చట్టాలను పాటించడం, యూపీఐ లావాదేవీల కోసం మల్టీ బ్యాంకు సెటప్ వంటివి ఎన్‌పీసీఐ మార్గదర్శకాలను పేటీఎం తప్పక అనుసరించాల్సి ఉంటుంది. పేటీఎం పూర్తి స్థాయిలో ఇతర పోటీదారులతో చేరుకోవడానికి సమయం పట్టవచ్చు అయినప్పటికీ, ఎన్‌పీసీఐ ఆమోదంతో కంపెనీ యూపీఐ యూజర్ బేస్‌ను మరోసారి పెంచుకునే సరికొత్త అవకాశాన్ని అందిస్తోంది.